Jharkhand Elections : అరెస్టయితే ముఖ్యమంత్రి అవుతారా?

దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా అరెస్టయితే ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తుంది.

Update: 2024-11-23 06:29 GMT

దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా అరెస్టయితే ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తుంది. ఇప్పుడు జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అది నిజమని చెప్పక తప్పదు. జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు ఇండి కూటమి 49 స్థానాల్లో దూసుకుపోతుంది. బీజేపీ కూటమి కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అయితే మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ కూటమి జార్ఖండ్ లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలు కనిపిస్తుంది. 81 అసెంబ్లీ స్థానాలుండగా, మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలుగా ఉంది. అయితే కాంగ్రెస్ కూటమి మాత్రం ఇక్కడ గెలవడానికి హేమంత్ సోరెన్ ప్రధాన కారణంగా చె్ప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

అరెస్ట్ కావడంతో...
హేమంత్ సోరెన్ అరెస్ట్ ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందని చెబుతున్నారు. బొగ్గు గనుల కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నచంపై సోరెన్ ను తమ పార్టీలోకి లాక్కొని బీజేపీ పెద్ద తప్పు చేసింది. బీజేపీలోకి వెళ్లేందుక చంపై సోరెన్ చేసిన ప్రయత్నాలు కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని చెప్పాలి. అన్యాయంగా హేమంత్ సోరెన్ ను రాజకీయ కక్షలతోనే జైల్లోకి పెట్టారని ప్రజలు పెద్దయెత్తున అభిప్రాయపడి కాంగ్రెస్ కూటమికి అండగా నిలబడారని చెబుతున్నారు.
ఏపీలోనూ...
ఆంధ్రప్రదేశ్ లోనూ గత ఎన్నికల కంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉన్నారు. చంద్రబాబు యాభై రెండు రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆ వయసులో చంద్రబాబు జైలులో ఉండటాన్ని ఎవరూ హర్షించలేదు. పైగా కావాలని జగన్ కక్ష కట్టి చంద్రబాబు ను జైల్లో పెట్టారని జనం విశ్వసించారు. అందుకే తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 స్థానాలలో ప్రజలు గెలిపించారు. వైసీపీని కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీ ఎన్నికలలో ప్రభావం చూపిందన్న విశ్లేషణలు బాగా వచ్చాయి. అదే కూటమి పార్టీలకు కలసి వచ్చిందనే చెప్పాలి.
రెండు హామీలు...
ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లోనూ హైమంత్ సోరెన్ అరెస్ట్ ఇండి కూటమికి కలసి వచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు సీఎం మయ్యా యోజన కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని జేఎంఎం ఇచ్చిన హామీ కూడా పనిచేసింది. గిరిజనులు ఎక్కువ శాతం మంది హేమంత్ సోరెన్ వైపు నిలబడ్డారు. సింపతీ ఫ్యాక్టర్ బాగా పనియడంతోనే ఈ ఎన్నికల్లో కనీసం జార్ఖండ్ లో అయినా విజయం సాధించిందనే చెప్పాలి. జైలు సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయిందని బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక గుణపాఠం గా చెప్పాలి. జైల్లో ప్రత్యర్థులను పెడితే.. స్వల్పకాలికంగా ఆనందం పొందవచ్చేమో కానీ, ఎన్నికల్లో మాత్రం వారికే భారీ ప్రయోజనం దక్కుతుందన్నది వాస్తవం. సో.. రాజకీయ నేతలు పారా హుషార్. జైలుకు పంపకుండానే ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలను రచిస్తే మంచింది.


Tags:    

Similar News