రాంచరణ్ పై పోటీకి రాంగోపాల్ వర్మ సిద్ధం

Update: 2016-10-10 07:31 GMT

విజయ దశమి పండుగకి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలుగా ప్రేమమ్, ఈడు గోల్డ్ ఎహె విడుదలలు సందడి చేస్తుండగా అనువాద చిత్రాలుగా వచ్చిన జాగ్వార్, మన ఊరి రామాయణం, అభినేత్రి చిత్రాలు ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని పంచుతున్నాయి. ఇక 14 న విడుదల కాబోతున్న మరో అనువాద చిత్రం నాగ భరణం తప్ప మరే ఇతర పెద్ద చిత్రాలు విజయ దశమి బరిలో లేవు. ముందుగా గీత ఆర్ట్స్ వారు రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ధ్రువ చిత్రాన్ని విజయ దశమికి విడుదల చేస్తామని ప్రేక్షకులకు మాట ఇచ్చి ఇటీవల చిత్ర విడుదల వాయిదా వార్తని చెప్తూ ప్రేక్షకులను, మెగా అభిమానులను అలరించే కానుకగా ఈ నెల 15 వ తేదీన మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.

ఏ వ్యక్తినైనా, వ్యక్తి పై అభిమానాన్ని ఐనా, వ్యవస్థనైనా, వ్యవస్థ లోని లోపాలనైనా, ఇతర చిత్రాల విజయాలనైనా, వైఫల్యాలనైనా తన ట్విట్టర్ ద్వారా ఎత్తిచూపుతూ తన సొంత ప్రచారానికి బాగా ఉపయోగించుకునే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ధ్రువ టీజర్ విడుదలను కూడా వదలలేదు. "అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు వంగవీటి సినిమాకు సంబంధించిన కొన్ని 'ధ్రువ' తారల్లాంటి చాలా మామూలు షాట్లు రిలీజ్ చేయబోతున్నాను." అని ట్వీట్ చేసారు వర్మ. అయితే ఇందులో మసాలా పాళ్ళు చాలవు అనుకున్నాడో ఏమో వెంటనే ఇంకో ట్వీట్ లో "దుర్గమ్మ ఆశీసుల కోసం అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు కాపు కాచే కమ్మనైన వంగవీటికి సంబంధించి కొన్ని ధ్రువతారల్లాంటి మామూలు షాట్లు" అంటూ నొక్కి చెప్పాడు.

ధ్రువ టీజర్ విడుదల సమయానికే సరిగ్గా తన చిత్రానికి సంబంధించిన షాట్లు విడుదల చేస్తానని చెప్తూ, అవసరం లేకపోయినా కమ్మనైన, కాపు కాచే అనే పదాలు వాడి తన వైవిధ్యాన్ని చాటుకున్నాడు వర్మ. తన కామెంట్ల మీద ఎంత రగడ రేగితే.. సినిమా ప్రచారానికి అంతగా ఉపయోగపడుతుందని ఆయన ఆశ పడుతుంటారనడంలో కొత్త దనం ఏమీ లేదు కదా.

Similar News