నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఉదయం షోకి యావరేజ్ అన్నవాళ్లే సాయంత్రానికి సినిమాకి హిట్ టాక్ ఇచ్చారు. అరవిందగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అరవింద సమేత మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోలా నడించిందని ప్రేక్షకుల టాక్. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన బలం జగపతి బాబు. రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతిగా విలనిజం చూపించిన జగపతి బాబు అరవింద సమేతలో అదరగొట్టాడు. ఈ సినిమా చూశాక జగపతి బాబు లేకపోతే అరవింద సమేత వీరరాఘవ లేదు అని ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఎందుకు అన్నాడో... ఈ సినిమా చూశాక అర్ధమైపోతుంది.
పాత్రలో జీవించిన జగపతి బాబు
పగ, ప్రతీకారం కోసం కన్న కొడుకుని కూడా చంపడానికి వెనుకాడని క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ పాత్రలో జగపతిబాబు నటించడం కాదు జీవించాడనే చెప్పాలి. మెడలో కత్తి దిగినా.. రక్తం కారుతున్నా.. తన పగను నరనరాల్లో జీర్ణించుకునే పాత్ర కోసం ప్రాణం పెట్టాడాయన. జగపతి బాబు రూపం ఆయన విలనిజం చూసిన ఎవ్వరైనా జగపతి బాబుని ఎన్టీఆర్ చెప్పినట్టు ప్రత్యేకంగా పొగడడం ఖాయం. ఇప్పటికే చెప్పినట్టు జగపతి బాబు విలన్ గా దొరకడం మాత్రం టాలీవుడ్ కి నిజంగా అదృష్టమని చెప్పాలి.