ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ లో తెరక్కేకుతున్న అరవింద సమేత - వీర రాఘవ షూటింగ్ లో ఒక సాంగ్ బ్యాలెన్స్ తప్ప మిగతా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసింది. ఎందుకంటే అరవింద సమేత విడుదలకు కేవలం అంటే కేవలం 20 రోజుల టైం కూడా లేదాయే. జై లవ కుశ హిట్ తర్వాత ఎన్టీఆర్ చెయ్యబోయే చిత్రంపై ఫ్యాన్స్ లోనే కాదు ట్రేడ్ లోను మంచి అంచనాలున్నాయి. త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి ఎఫెక్ట్ కూడా ఈ సినిమా బిజినెస్ మీద పడడంలేదు. ఇప్పటికే అరవింద సమేత పాటలు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే థమన్ మ్యూజిక్ కాపీ కాపీ అంటున్నప్పటికీ... పెనిమిటి, అనగనగా పాటలకు మాత్రం ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ బావుంది.
తాజాగా అరవింద సమేత సినిమా కథ గురించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అరవింద సమేత - వీర రాఘవ కథ ఇదే అంటూ ఒక కథ ప్రచారంలోకి రావడం... ఈ కథతో సినిమా హిట్ అవుతుందా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చెయ్యడం కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అరవింద సమేత కథ రెగ్యులర్ సీమ స్టోరీనే తలపిస్తుంది. ఎన్టీఆర్ తండ్రిగా నాగ బాబు... విలన్ గా జగపతి బాబు లు ఊరి పెద్దలుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పగలు ఉండడం.. ఊరి బాగు కోసం భార్య ను కూడా వదిలేసి ఊరి కోసం నాగ బాబు పాటు పడడం.. కక్షలకు కార్పణ్యాలకు దూరం గా కొడుకు రాఘవను (ఎన్టీఆర్) ఎక్కడో వేరే చోట ఎవరికీ తెలియనంత దూరంలో చదివిస్తుంటాడు. ఆ సమయంలో పరిచయమవుతుంది అరవింద (పూజ హెగ్డే) జగపతి బాబు కూతురు. తనను ఊరికి తీసుకెళ్లి నాన్నకు పరిచయం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న రాఘవకు ఊరిలో ఉన్న దారుణమైన పరిస్థితులు ఆలస్యంగా తెలుస్తాయి.
అయితే ఆ ఊరిలో ఉన్న సమస్యలను ఒక కొలిక్కి తెచ్చి అరవింద ని పెళ్లి చేసుకోవాలనుకున్న రాఘవ తన కళ్ళ ముందే తండ్రి చావుని చూడడం.. తర్వాత ఆ ఊరి ప్రజల కోసం నాయకుడిగా మారడం.. అబ్బో ఇదే అరవింద సమేత కథ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే.. అమ్మో ఈ కథతో ఎన్టీఆర్ ఎలా హిట్ కొడతాడంటూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. . ఇంత రొటీన్ కథను త్రివిక్రమ్ తనదైన శైలిలో మాటల మాంత్రికుడిగా కామెడీ తో కూడిన డైలాగ్స్ తో ఏమన్నా మాయ చేస్తాడేమో అనే ఆశాభావంలో ఉన్నారు. మరి అరవింద కథ ఇది నిజమా.. కాదా అనేది మాత్రం అక్టోబర్ 11 న కానీ క్లారిటీ రాదు.