బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి మొన్న ఆదివారం నుండి మొదలైంది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. సీజన్ 1 లో ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్ కాస్త అటు ఇటుగా ఉన్న నాని బిగ్ బాస్ వ్యాఖ్యానం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ షోలోకి 16 మంది పార్టిసిపేట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో 13 మంది సెలెబ్రేటిస్ అయితే మిగతా ముగ్గురు కామన్ పీపుల్. అయితే పెద్దగా సెలెబ్రిటీ హోదా లేని వారు ఈ షోలో చాలామందే ఉన్నారు. సింగర్ గీత మాధురి, యాంకర్ శ్యామల, తనీష్, సామ్రాట్,కిరీటి, తేజస్వి మడివాడ, బాబు గోగినేని, టివి 9 దీప్తి వంటి వాళ్లకు కాస్త ఫెమ్ ఉంటె... మిగతా వాళ్లకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని మొహాలే.
అయితే ప్రస్తుతం కాస్త నీరసంగా సాగుతున్న ఈ షో లో కాస్త మసాలా పట్టడానికి టైం పడుతుంది. తొందరగా ఈ షో లో బాగా మసాలా దట్టించాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు కంటెస్టెంట్స్ కి స్టార్ మా వాళ్ళు ఎంతిస్తున్నారో అనే దాని మీద ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే వారికి పారితోషకాలు ఎంతిస్తున్నారో అనే దానిమీద ఎవరికీ తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు కూడా. అందులో అందరికన్నా ముందుగా సింగర్ గీతా మాధురికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు గాను 20 లక్షలిస్తున్నారట. అంటే షో నుండి ఎలిమినేటి అయినా... గీత కి 20 లక్షలు ఇచ్చేస్తారన్నమాట. ఇక యాంకర్ శ్యామలకి 5 నుంచి 10 లక్షలు, నటుడు తనీష్ కు కూడా అంతే మొత్తంలో అంటే కాస్త లక్ష రెండు లక్షలకు అటు ఇటుగా ఇస్తున్నట్టు గా ఊహాగానాలు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి.
ఇక మిగతా వారికీ మాత్రం రోజుకి ఇన్నివేల చొప్పున స్టార్ మా అగ్రిమెంట్ చేసుకుందని కూడా అంటున్నారు. అది కూడా రోజుకి 15 నుండి 25 మధ్యలో ఆ ఫిగర్ ఉండొచ్చనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇక టీవీ ఛానల్స్ డిబేట్స్ లో నకిలీ డాక్టర్స్ కి, నకిలీ స్వామీజీలకు చమట్లు పట్టించగల హేతువాది బాబు గోగినేని కి మాత్రం ఎంతిస్తున్నారో అనే దానిమీద ఎవరికీ ఊహకి కూడా అందడం లేదట. అందుకే బాబు గోగినేని పారితోషకాన్ని ప్రస్తుతం సస్పెన్స్ అంటున్నారు.