మొన్నామధ్యన దేవదాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవా పాత్ర చేసిన నాగార్జున ఒక మాట వదిలేసాడు. అదేమిటంటే దేవదాస్ మూడు రోజుల క్రితమే చూశాను. పది రోజుల ముందు చూస్తే ఎమన్నా చెయ్యగలిగేవాళ్లమని అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఇరకాటంలో పడేసాడు. నాగార్జున అలా మాట స్లిప్ అయినందుకు మీడియా మాత్రం రకరకాల న్యూస్ లు దేవదాస్ విషయంలో వండి వార్చింది. అయితే ఏమనుకున్నాడో ఏమో నాగార్జున ఆ వార్తలకు రిపేరు చేయబోయి మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యాడు. అదేమిటంటె దేవదాస్ రేపు విడుదలవుతుంది అన్న సమయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దేవదాస్ సినిమా ఈ రోజే చూసాను. సినిమా చాలా బావుంది అందరూ చూడండి అన్నాడు. అయితే అప్పటినుండి అందరికి ఏదో మూల నాగార్జున మొదట్లో మాట్లాడిన మాటలు మీద అనుమానాలు అలానే ఉన్నాయి.
హిట్ టాక్ తో......
తాజాగా నిన్న గురువారం విడుదలైన దేవదాస్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నాగార్జున, నాని కాంబో సీన్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. అంత బాగా సెట్ అయ్యారు నాగ్ - నాని దేవా, దాస్ పాత్రల్లో. మరి సినిమాలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా సినిమా మొత్తం ఇద్దరూ నాగ్, నాని లు ఇరగదీసారు. అయితే నాగ్, నాని నటనకు ఎంతైతే పేరొచ్చిందో... అలాగే సినిమా లో ఉన్న లోపాలను క్రిటిక్స్ ఉతికి ఆరేశారు. దేవదాస్ సినిమాలో చాలానే లోపాలున్నాయి. అయితే వాటిలో సినిమా నిడివి కాస్త ఎక్కువడం, ఎడిటింగ్ లో తలెత్తిన లోపాలు కూడా వున్నాయి. అయితే ఎడిటింగ్ లో లోపాలుండడానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు.
ఎడిటింగ్ లో లోపాలు......
సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తైతే.. సినిమా ఎడిటింగ్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఎడిటింగ్ విషయంలో చిన్న చిన్న మార్పులే.. సినిమా భవిష్యత్తుని మార్చేస్తాయి. అందుకే సదరు హీరోలు ఎడిటింగ్ విషయంలో వేలెట్టి కెలుకుతారు. దర్శకుడు, నిర్మాత, హీరోలు ఇలా ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ ని తన పని తాను చేసుకోనివ్వరు. తాజాగా దేవదాస్ విషయంలో అదే జరిగిందనే టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో నాగ్, నాని హీరోలు కాబట్టి... నాని ఒక టైం లో వచ్చి… కొన్ని మార్పులు ఎడిటర్ కి చెప్పి వెళ్లిపోయేవాడట.
తర్వాత నాగ్ వచ్చి......
ఆ తరవాత నాగ్ వచ్చి..అలా కాదు.. ఇలా మార్చండి అనేసరికి ఆ మార్పులు మళ్లీ మొదటికి వచ్చేవని… చివర్లో దర్శకుడు రంగంలోకి దిగి..అలా కాదు... ఇలా మార్చండి అనే సరికి సినిమా మరో రూపంలోకి వెళ్లేపోయేదని.. ఇక హీరోలు, దర్శకుడు చెప్పిన తర్వాత తాపీగా ఆశ్వనీదత్, ప్రియంక, స్వప్న… ఇలా ఈ సినిమాలోని బృందం మొత్తం తలో సలహా ఇవ్వడం వలన దేవదాస్ ఎడిటింగ్ విషయంలో చాలా సమస్యలు తలెత్తాయని అంటున్నారు. మరి ఇదంతా చూస్తుంటే నాగార్జున మొదట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎడిటింగ్ విషయంలో తెలిసిన విషయాలకు కరెక్ట్ గా సింక్ అవుతున్నాయి. సినిమా త్వరగా రెడీ అయితే... ఆ సినిమా చూసి మార్పులు చేర్పులు చేసుకునేవారు హీరోలు. కానీ సినిమా రెడీ అవడానికి విడుదలవడానికి మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్లనే దేవదాస్ కి ఎడిటింగ్ లో ప్రోబ్లెంస్ వచ్చాయన్నమాట.