శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంటుంది. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల దాకా రిలీజ్ అవుతుంటాయి. కొన్ని నెలల నుండి శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ పోయింది. ఏదో పెద్ద సినిమా వస్తుంటే తప్ప చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేవు. దాంతో బాక్సాఫీస్ డల్ గా మారింది. తెలుగులో గత శుక్రవారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చెప్పుకోదగ్గ సినిమా శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు నటించిన 'వీర భోగ వసంత రాయలు'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడు అవుతుంది.. ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా జనాలు ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే రిలీజ్ కి మూడు రోజుల ముందే యుఎస్ లో ప్రీమియర్లు వేసి ఏదో సాధించాలి అనుకున్న నిర్మాతల ఎత్తుగడ అడ్డంగా బెడిసి కొట్టింది. దీంతో ఈ సినిమాను ఇక్కడ చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడక పోవడంతో మొదటి రోజే హౌస్ ఫుల్ అవ్వలేకపోయింది.
అన్ని సినిమాలూ అంతే...
మరో చిన్న సినిమా 'బంగారి బాలరాజు' పేరుతో వచ్చింది. దీనికి ప్రమోషన్స్ అవి ఇవి బాగానే చేశారు. కానీ ప్రేక్షకుల నుండి కనీస స్పందన కరువైంది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని కుర్రాడిని సరైన శిక్షణ ఇవ్వకుండా హీరోగా పెట్టి తీయడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలానే 'రథం' అనే మరో ఆణిముత్యం కూడా ప్రేక్షకులను పలకరించింది. 'ఆర్ఎక్స్ 100 ' రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకున్నారు కానీ వర్కవుట్ అవ్వలేదు. కాకపోతే 'బంగారి బాలరాజు' మీద కొంత నయం అంతే. ఇంకా అదే రోజు '2 ఫ్రెండ్స్' అనే చిన్న సినిమా వచ్చింది. అసలు ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయిందో కూడా తెలియదు. వీటితో పాటు ఆర్య, తమన్నా జంటగా విశాల్ క్యామియో చేసిన తమిళ డబ్బింగ్ 'ఐశ్వర్యాభిమస్తు' సినిమా రిలీజ్ అయింది. దీనికి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కాబట్టి ఈ శుక్రవారం పూర్తిగా తేడా కొట్టేసినట్టే .