భారీ అంచనాలు అందుకుంటుందా..?

Update: 2018-06-06 12:06 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మన్నా కూడా ఆయన కొత్త సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ పా దర్శకత్వంలో ధనుష్ నిర్మతగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కి ట్రేడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోయినా... ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. రజినీకాంత్ తో రంజిత్ పా గతంలో తీసిన భారీ బడ్జెట్ కబాలి సినిమా ఘోరమైన ప్లాప్ అయ్యింది. అయినా ప్రస్తుతం వీరి కాంబోలో వస్తున్న కాలా సినిమాపై అంచనాలున్నాయి.

సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీ...

అయితే గతంలో రజిని నటించిన కబాలి సినిమా విడుదలైనప్పుడు... రజినికున్న క్రేజ్ వలన తమిళనాట ఐటి కంపెనీలన్నీ సెలవు ప్రకటించాయి. ఐటి ఉద్యోగులు కబాలి సినిమాని మొదటిరోజు మొదటి షో చూడడానికి గానూ అప్పట్లో ఐటి కంపెనీలన్నీ సెలవు ప్రకటించాయి. అయితే ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తాజాగా రజిని సినిమా కాలా విడుదలవుతున్న రేపు అంటే జూన్ 7 న రజిని కాలా సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఉద్దేశ్యంతో.. చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగానికి సెలవు పెట్టాలని నిర్ణయించారట. అయితే ఉద్యోగులందరి దృష్టి కాలా సినిమాపై ఉందని గ్రహించిన కేరళలోని టెలిసియస్ టెక్నాలజీ అనే ఒక ఐటీ సంస్థ .. రేపు కాలా విడుదల సందర్భంగా తమకంపెనికి సెలవును ప్రకటించింది.

అంచనాలు అందుకునేనా..?

ఉద్యోగుల ఆసక్తి మీద నీళ్లు చల్లడం ఇష్టం లేని టెలిసియస్ టెక్నాలజీ ఈ నిర్ణయం తీసుకుందట. అయితే తమ సంస్థ ఆ రోజుని సెలవుదినంగా ప్రకటించిన మాట నిజమేనని అందులో పనిచేస్తోన్న ఉద్యోగులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే కేవలం తమ సంస్థ పబ్లిసిటీ కోసం ఇలా చేయలేదనీ.. సూపర్ స్టార్ రజనీ సినిమా పట్ల ఉద్యోగుల్లో గల ఉత్సాహాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. మరి భారీ అంచనాల నడుమ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కాలా సినిమా ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.

Similar News