బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని తేరా మీద ఆవిష్కరించాలని ‘యన్.టి.ఆర్' బయోపిక్ ను తీస్తున్నాడు. ఈ చిత్రానికి మొదటిలో తేజ డైరెక్టర్ కాగా ఇప్పుడు అతను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ అవకాశం క్రిష్ కి వరించింది. లేటెస్ట్ ఓ వీడియో రూపంలో క్రిష్ ఓఫిషల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ తన సినీ రంగ ప్రవేశంతో పాటు తన రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించబోతున్నారు.
అయితే కీలకంగా ఉన్న వివిధ వ్యక్తుల పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు యాత్ర చేస్తున్న టైములో చైతన్య రథాన్ని నడిపించిన నందమూరి హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడైన కళ్యాణ్ రామ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు. అయితే ఈ విషయం గురించే కళ్యాణ్ రామ్ ని అడగగా..అతను చిత్రమైన సమాధానం ఇచ్చాడు.
‘‘ఏమోనండీ. ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోయాయి కదా? ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కావట్లేదు. నిజానికి ఆ పాత్ర చేయాలనీ నన్ను ఎవరు అడగలేదు.. కానీ ఒక్కసారి డైరెక్టర్ తేజ మాత్రం నువ్వు ఈ సినిమాలో ఒక పాత్ర చేయాలనీ అడిగారు అంతే. కానీ ఆ పాత్రేమిటన్నది తెలియదు. ఇప్పుడు ఆయన మారిపోయారు కదా’’ అంటూ నర్మగర్భమైన సమాధానం ఇచ్చాడు కళ్యాణ్ రామ్. గతంలో కళ్యాణ్ రామ్.. తేజ డైరెక్షన్ ‘లక్ష్మీకళ్యాణం’ చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతో అతడికి రోల్ ఇవ్వాలనుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతిలో పడింది. మరి క్రిష్ ఆ పాత్ర గురించి ఏం ఆలోచిస్తాడో చూడాలి.