షారుఖ్ ఖాన్ ను కాదు.. ఆపింది ఆయన బాడీగార్డును..!

Update: 2022-11-13 07:02 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ఎయిర్ పోర్టులో ఆపేశారనే వార్తలు శనివారం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..! ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు షారుఖ్ ను ఆపేశారని చెప్పుకొచ్చారు. అనేక ఖరీదైన గడియారాలు, ఇతర గాడ్జెట్‌లను తీసుకుని వస్తున్నారని.. అందుకే ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులు షారుఖ్ ఖాన్ ను ఆపినట్లు శనివారం నివేదించబడింది. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చినట్లు విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) వర్గాలు తెలిపాయి. యూఏఈలోని ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్‌ సినిమా ఐకాన్‌, కల్చరల్‌ నరేటివ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం షారుఖ్‌ ఖాన్‌ దుబాయ్‌ వెళ్లారు. షారుఖ్ ఖాన్, అతడి బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగులని సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగులో Baubn & Zurbk వాచీలు, 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, Apple సిరీస్ వాచీలు లభించాయి. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి.

అయితే ఆపింది షారుఖ్ ఖాన్ ను కాదని.. అతని అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ అని తేలింది. షారుఖ్ ఖాన్ అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ కస్టమ్స్ కు డబ్బులు చెల్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. షారుఖ్, అతని మేనేజర్ పూజా దద్లానీ, రవిశంకర్ సింగ్.. మరో ముగ్గురు సభ్యులు చార్టర్డ్ ఫ్లైట్‌లో 12:30 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌లో దిగారు. లగేజీ స్క్రీనింగ్ సమయంలో, కస్టమ్స్ సిబ్బంది ఆరు బ్యాగ్‌లలో రెండింటిలో ఆరు లగ్జరీ వాచీలను కనుగొన్నారని అధికారి తెలిపారు. వాచీలు రూ.17.86 లక్షలకు విలువ చేయగా, ప్రస్తుతం ఉన్న రేటు ఆధారంగా రూ.6.88 లక్షల కస్టమ్స్ సుంకం విధించినట్లు తెలిపారు. జనరల్ ఏవియేషన్ టెర్మినల్ కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు కౌంటర్ పనిచేయకపోవడంతో, కస్టమ్స్ అధికారులు షారుఖ్ బాడీగార్డ్‌ను విమానాశ్రయంలోని టెర్మినల్ 2కి తీసుకెళ్లారు, అక్కడ అతను సూపర్‌స్టార్ తరపున మొత్తాన్ని చెల్లించాడని అధికారి తెలిపారు. కొంత సమయం సింగ్‌ అక్కడే వేచి ఉండగా.. ఖాన్‌తో సహా మిగిలిన ఐదుగురు సభ్యులు విమానాశ్రయం నుండి వెళ్ళిపోడానికి అనుమతించారని, ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు ప్రక్రియ పూర్తయిందని అధికారి తెలిపారు. షారుఖ్ ఖాన్ ను అస్సలు అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి ప్రశ్నలు అడగలేదని కస్టమ్స్ విభాగం తెలిపింది.


Tags:    

Similar News