ఫిదా చిత్రం దగ్గరనుండి స్పీడు పెంచిన వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఎడా పెడా సినిమాలు చేసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం సినిమాతో ఈ డిసెంబర్ లోను, ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పటికే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన వరుణ్ తేజ్ జోరు మాములుగా లేదు. అయితే మీడియం హీరోగా దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతినాయకుడు పాత్ర మీద మోజు పడుతున్నాడనే ప్రచారం ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. ఈమధ్యన టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోను చాలామంది హీరోలు తమకొచ్చిన నెగెటివ్ కేరెక్టర్స్ ని ఉతికి ఆరేస్తున్నారు.
స్టార్ హీరోలైనా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చెయ్యడానికి వెనుకాడడం లేదు. జై లవ కుశ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా మెప్పించాడో తెలిసిందే. ఇంకా ఈ మధ్యన మాధవన్, ఆది పినిశెట్టి, రానా వంటివారు విలన్ కేరెక్టర్ స్లో ఇరగదీస్తున్నారు. మరి వరుణ్ కూడా అలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించడానికి మోజు పడుతున్నాడంటే... అందులో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. మరి అలాంటి పాత్రే వరుణ్ కి తగలడంతో... వరుణ్ ఇప్పుడు విలన్ పాత్రకి సై అంటున్నాడట. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకున్న జిగడ్తాండ లో సిద్దార్థ్ హీరోగా నటిస్తే... బాబీ సింహా విలన్ గా నటించాడు. అయితే హీరో సిద్దార్ధ్ కన్నా ఎక్కువగా ఆ సినిమాలో విలన్ పాత్ర చేసిన బాబీ సింహా కు మంచి పేరు వచ్చింది.
మరి అదే జిగడ్తాండ ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాట. తెలుగు రీమేక్ లో హీరో పాత్రని మరింత తగ్గించి విలన్ పాత్రకి మరింత హైప్ ఇవ్వాలని చూడడం.. హీరొకింద ఎవరినైనా సెలెక్ట్ చేసి నెగెటివ్ పాత్రలో మాత్రం వరుణ్ తేజ్ ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జిగడ్తాండ రైట్స్ దగ్గరపెట్టుకున్న దిల్ రాజు, హీరోగా, దర్శకుడిగా ఎవరికీ అవకాశం ఇస్తాడో కానీ.. విలన్ గా మాత్రం వరుణ్ చేస్తాడంటున్నారు. మరి ఈ సినిమాలో విలన్ రోల్ కున్న ఇంపోర్టన్స్ తోనే వరుణ్ ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి ఓకె చెప్పాడంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.