సమాజంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమిళ హీరోలు చూపే సేవాభావం మామూలుగా ఉండదు. ఇటీవల తూత్తుకూడిలో జరిగిన కాల్పుల బాధితులను హీరో విజయ్ సేతుపతి అర్థరాత్రి బైక్ పై వెళ్లి పరామర్శించారు. అంతేకాదు, వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇక తెలుగు వ్యక్తి, తమిళ హీరో విశాల్ ది పేరులానే చాలా విశాల హృదయం. చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతుల పట్ల ఆయన సేవా భావం చూపారు. విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా ఇటీవల తెలుగులో విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.12 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులను ఆదుకునేందుకు తనవంతుగా ప్రతి సినిమా టిక్కెట్ పై ఒక్క రూపాయి ఇస్తానని ప్రకటించాడు. దీంతో విశాల్ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. కోట్లకొద్ది రెమ్యూనరేషన్లు తీసుకునే హీరోలు విశాల్ చూసైనా కాస్త సమాజం కోసం ఆలోచించాలని కోరుతున్నారు.