అమ్మ ఇచ్చి వెళ్లిన దానితోనే బాగా బతుకుతున్నాం

Update: 2017-04-27 09:33 GMT

చిత్ర పరిశ్రమ చూసిన అత్యంత అద్భుతమైన అరుదైన నటీమణులలో ప్రధమ స్థానం మహానటి సావిత్రి గారిది అనటంలో అతిశయోక్తి లేదు. అంతటి మహానటి జీవిత విశేషాలని తెలుసుకునే అవకాశం నేటి తరానికి కలుగజేస్తుంది దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న సావిత్రి గారి బైయోపిక్. ఈ బైయోపిక్ పుణ్యమా అని సావిత్రి గారి జీవితంలో మనకి తెలియని ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆవిడ వైవాహిక జీవితం, కుటుంబం, చివరి రోజులలో మద్యానికి బానిస అయ్యేంతలా ఆవిడపై ప్రభావం చూపిన వ్యక్తిగత జీవితపు విభేదాలపై సామాన్య ప్రజలతోపాటు సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులలో కూడా ఎన్నో అపోహలు వున్నాయి.

ఈ అపోహలన్నిటికి సమాధానం ఇస్తూ తొలి సారి మహానటి అనుభవించిన చివరి రోజుల గురించి మీడియా తో మనసు విప్పి మాట్లాడారు ఆమె తనయురాలు విజయ చాముండేశ్వరి. "అమ్మ సినిమా నటిగా సాగించిన విజయవంతమైన ప్రస్తానం అందరికి తెలుసు. ఆవిడకి కీర్తి ప్రతిష్టలు వచ్చిన తరువాత అప్పటి నటుడు జెమినీ గణేశన్ తో వివాహం జరగటంతో అమ్మ పతనం ప్రారంభం అయ్యిందని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అది పూర్తిగా వాస్తవం కాదు. అమ్మ నాన్నల మధ్యన విభేదాలు ఉండేవి. అవి నాకు తెలిసేవి కాదు. నాకు 16 సంవత్సరాల వయసుకే వివాహం ఐపోవటంతో నా పై అమ్మ పడ్డ మానసిక వేదన తాలూకా ప్రభావం చాలా తక్కువ. మా సోదరుడు మాత్రం ప్రత్యక్షంగా వాటన్నిటికీ సాక్ష్యుడు. మానసిక ఒత్తిడికి లోనై అమ్మ మద్యానికి బానిస అయ్యారు. ఆవిడ చివరి రోజులలో 19 నెలల పాటు కోమాలో వున్నారు. ఆవిడ కోమా నుంచి బైటకి వస్తారనే ఎదురు చూసాం. అమ్మ ఆర్ధిక ఇబ్బుందులు ఆవిడ మరణానికి ప్రధాన కారణం అనే ప్రచారం కూడా ఒకటి వుంది. అమ్మ మాకు ఇచ్చి వెళ్లిన ఐశ్వర్యంతోనే మేము ఇప్పటికీ సంతోషంగా వున్నాం అని చెప్పగలను. ఆవిడ దయ లేనిదే మేము ఈ స్టాహాయిలో ఉండేవాళ్ళం కాదు." అంటూ మహానటి జీవిత ప్రస్థానంపై ప్రచారంలో వున్న కొన్ని ముఖ్య విషయాలని వాస్తవ దూరం అని ఆమె తనయురాలు విజయ చాముండేశ్వరి కొట్టి పారేయటంతో ఇప్పుడు మహానటి చిత్రంలో నాగ్ అశ్విన్ ఏమి చూపబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకులలో ఎక్కువ అవుతుంది.

Similar News