ఈ బిజినెస్ చూస్తే కళ్ళు దిరగడం ఖాయం!!

Update: 2017-07-26 14:03 GMT

గతంలో ఒక ఇసినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టాలి అంటే వణికిపోయేవారు. కానీ బాహుబలి పుణ్యమా ఇప్పుడు బడా చిత్రాలన్నీ హై బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. 100 కోట్ల బడ్జెట్ నుండి 150 , 200 కోట్ల బడ్జెట్ వరకు పెట్టుబడి పెట్టెయ్యడానికి నిర్మాతలు రెడీ అవడం ఒక ఎత్తైతే... ఇప్పుడు బడా సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా 100 కోట్ల మార్కుని దాటేసి ఔరా అనిపిస్తున్నాయి. 70 నుండి 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు 100 కోట్ల పైమాటే బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ 100 కోట్ల మార్కు కూడా బాహుబలిని చూసిన తర్వాత చాలా చిన్నదిగానే కనిపిస్తుంది.

ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ లు చూస్తుంటే అంచనాలు మించి జరుగుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా... తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరిగినట్టు చెబుతున్నారు. ఇక మిగిలిన మహేష్ స్పైడర్ చిత్రం బిజినెస్ చూస్తే మాత్రం కళ్ళు తిరగడం ఖాయం అంటున్నారు. మరి 100 కోట్ల మార్క్ కే అమ్మో అంటుంటే ఇప్పుడు స్పైడర్ బిజినెస్ 200 కోట్ల వరకు జరిగి స్పైడర్ నిర్మాతలకు బోలెడు లాభాలు తెచ్చిపెట్టబోతుందనే ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతుంది.

తెలుగు తమిళంలో ఏక కాలంలో తెరకెక్కతున్న స్పైడర్ చిత్రం ఒక్క తెలుగు వెర్షన్ కె 90 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. ఇక తమిళంలో 2 .0 నిర్మణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు... 23 కోట్లకి కొన్నారని అధికారిక సమాచారం ఉంది. అలాగే అన్ని భాషలకు కలిపి శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.26 కోట్లు వచ్చిందనేది టాక్. ఇకపోతే బాలీవుడ్ లో కూడా స్పైడర్ ని డబ్ చేసి వాడాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక అక్కడ కూడా 10 నుండి 15 కోట్లు వస్తాయని అంటున్నారు. ఇక స్పైడర్ ఆడియో హక్కులు ద్వారా మిగతా వాటికి కలిపి మొత్తం 200 కోట్ల మేర స్పైడర్ బిజినెస్ ఉంటుందని... అంటున్నారు.

మరి మహేష్ కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్, మురుగదాస్ కి తమిళంలో ఉన్న క్రేజ్ వెరసి స్పైడర్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో టాప్ లెవల్లో దూసుకుపోతుందనేది టాక్.

Similar News