కొరటాల దారిలోకి మరో దర్శకుడు

Update: 2016-10-15 05:35 GMT

కథ రచయితగా అనేక చిత్రాలకు కథలు అందించి, వాటి విజయంలోనూ ఆయనకీ రావాల్సిన గుర్తింపు రాకపోవటంతో తన కథలను తానే తెరకెక్కించాలని నిర్ణయించుకుని దర్శకుడు అయ్యారు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రంలో మనిషి ప్రేమను పంచటానికి అర్హుడు కానీ పగను పంచటానికి కాదు అనే అంతర్లీన సందేశాన్ని వాణిజ్య పరమైన కథనంతో తెరకెక్కించి విజయం సాధించారు. తన తదుపరి చిత్రం శ్రీమంతుడుతోనూ అభివృద్ధికి నోచుకోని గ్రామాలను దత్తత తీసుకునే అంతర్లీన సందేశం ప్రేక్షకులకు కనెక్ట్ ఐయింది. ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన జనతా గ్యారెజ్ లోనూ ప్రకృతితో పాటు తోటి మనిషిని కూడా మనిషే కాపాడుకోవాలని సందేశాన్ని చాలా సున్నితంగా చెప్పారు కొరటాల శివ.

ఆయన ప్రతి కథలోనూ ఏదో సందేశం ఇస్తున్నా, ఆయన కథలు, చిత్రాలు కేవలం ఒక వర్గ ప్రేక్షకులకు పరిమితం కాలేదు. కారణం ఆయన ఎంచుకున్న వాణిజ్య పరమైన కథనంతో సందేశాత్మక కథను నడిపే విధానం. అందుకే ఆయనతో పని చేసిన హీరోలందరికీ ఆయా చిత్రాలు వారికి ట్రాక్ రికార్డుగా నిలిచాయి. ఇప్పుడు ఆయన దారిలోనే అడుగులు వేసేందుకు నిర్ణయించుకున్నాడు మరో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆయన తీసిన మాస్ ఎంటర్టైనర్ కందిరీగ విజయం సాధించగా తదుపరి రెండు చిత్రాలు రభస, హైపర్ నిరాశ పరిచాయి.

ఇటీవల విడుదల ఐన హైపర్ లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో సత్తి రాజ్ ద్వారా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ చిత్రం మొదలు నుంచి పూర్తి అయ్యే వరకు పేలవమైన కథనంతో కథ నడవటంతో ఆ కథకు కానీ అందులోని సందేశానికి కానీ కనెక్ట్ కాలేకపోయారు ప్రేక్షకులు. కానీ తన తదుపరి చిత్రాలు కూడా సందేశాత్మక కథని వాణిజ్య అంశాలతో చెప్పే విధంగానే వుంటాయని ప్రకటించేశాడు సంతోష్ శ్రీనివాస్. హైపర్ వైఫల్యాన్ని విశ్లేషించుకుని సంతోష్ శ్రీనివాస్ తదుపరి కథనాలతో జాగ్రత్త పడతాడేమో చూడాలి.

Similar News