కోడి బొమ్మకు కోత పెట్టారు!

Update: 2016-10-20 13:00 GMT

అవును మరి.. ఆయనేదో సినిమా ఓపెనింగ్ కలెక్షన్లకు ఉపయోగపడతారని అనుకున్నారు. సినిమాలో అసలు విషయం ఏం ఉన్నదో ఏం లేదో ప్రజలకు తెలియనంత వరకూ ఆయన బొమ్మను మాత్రమే వాడుకుని ప్రచారం సాగించారు. కానీ ఒకసారి సినిమా విడుదల అయిపోగానే.. ఆయన బొమ్మను మాత్రమే వాడుకున్నందువల్ల టార్గెట్ చేసిన ఓపెనింగ్ కలెక్షన్ల పర్వం పూర్తయిపోగానే.. ఆయన బొమ్మకు ఇక కోతపెట్టారు. అచ్చంగా సినిమాలో సీన్లు మాత్రమే వేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు.

అవును ఇదంతా కన్నడ డబ్బింగ్ గా తెలుగులో కూడా రిలీజై.. గ్రాఫిక్స్ అనే మాయలో బాక్సాఫీసును కొల్లగొట్టాలని అనుకున్న ‘నాగభరణం’ సినిమాకు సంబంధించిన సంగతి. ఇది బేసిగ్గా కన్నడ సినిమా అనే సంగతి అందరికీ తెలుసు. కన్నడలో అయితే సినిమా ఓపెనింగ్స్ కుముందే ప్రచారం చేసుకోవడానికి ఇందులో చాలా మార్కెటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరణించిన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్దన్ పాత్రను గ్రాఫిక్స్ లో సృష్టించడం లాంటివన్నీ అలాంటివే.

కానీ ఆ మార్కెటింగ్ ఎలిమెంట్స్ కు తెలుగుతెరకు ప్రేక్షకుల్ని రాబట్టేవి కాదు. దాంతో నిర్మాతలు పూర్తిగా కోడి రామకృష్ణ క్రేజ్ మీదనే ఆధారపడ్డారు. సినిమా విడుదల అయ్యేంత వరకు.. యాడ్స్ సమస్తం.. కోడి రామకృష్ణ లాంటి మహాదర్శకుడి చిత్రం అనే ప్రచారం మాత్రమే సాగింది. సినిమా లోని సీన్లను ఫోకస్ చేయడంపై తక్కువ శ్రద్ధ పెట్టారు. తీరాసినిమా విడుదల అయిపోయాక.. అందులో ఉన్న సత్తా బయటపడిపోయింది. ఇక కోడి బొమ్మతో క్యాంపెయినింగ్ వేస్ట్ అనిపించిందేమో.. ఆయన మీద ఫోకస్ తగ్గించి.. సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ బీభత్సాన్ని హైలైట్ చేస్తూ ఇప్పుడు కొత్త యాడ్స్ వేస్తున్నారు. ఎక్కడైనా అంతే.. ఏరుదాటేదాకానే.. విలువ కాదంటారా?

Similar News