తమ్ముడి తర్వాతే నా పెళ్లి : నాగ చైతన్య!

Update: 2016-10-03 08:58 GMT

అక్కినేని వారి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగార్జున కొడుకులు ఇద్దరూ పెళ్లికి సిద్ధమైపోయారు. వీరిద్దరూ తమ కాబోయే భాగస్వాములను వారే ఎంచుకున్నారు. నాగార్జున జస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. అక్కడితో ఆనందించారు. కాకపోతే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోయేది ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరొకవైపు గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం పూర్తిచేసినట్లు కొన్ని పుకార్లు కూడా వచ్చాయి.

అయితే నాగచైతన్య ఒక టీవీ ఛానెల్‌ తో మాట్లాడుతూ ఈ విషయాల్లో కాస్త క్లారిటీ ఇచ్చాడు. ముందుగా తమ్ముడు అఖిల్‌ పెళ్లి అయిన తర్వాతే తన పెళ్లి ఉంటుందని చైతూ చెప్పాడు. అయితే అన్నయ్య పెళ్లిని ఆలస్యంగా ఎందుకు షెడ్యూలు చేశారనేందుకు ఆయన కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాకపోతే తమ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని మాత్రం చెప్పాడు

అయితే సమంత గురించి వ్యాపిస్తున్న మరో రకం పుకార్లకు కూడా నాగచైతన్య ఈ టీవీ ఛానెల్‌ వారి ఇంటర్వ్యూ ద్వారా ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. పెళ్లి అయిన తర్వాత సమంత సినిమాలు మానేస్తున్నదని, అందుకే ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తోందని, కొత్తవి ఒప్పుకోవడం లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే .. సమంత పెళ్లయిన తర్వాత కూడా యధావిధిగా సినిమాలు చేస్తుందని చైతూ వెల్లడించాడు.

సో, అభిమానులకు సస్పెన్స్‌ తీరిపోయినట్లే. పెళ్లి తేదీలు వెల్లడించలేదు గానీ.. ముందుగా తమ్ముడి పెళ్లి ఉంటుందని తేలింది.

Similar News