తమిళనాడులో సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ పుట్టినరోజు సోమవారం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. అసలే అమ్మ జయలలిత మరణం నేపథ్యంలో వేడుకలు వద్దని రజనీ పిలుపు ఇచ్చిన నేపథ్యంతో పాటు, సోమవారం చెన్నయ్ ను అతలాకుతలం చేసిన వార్ధ తుపాను ప్రభావం కూడా పడింది. అయితే రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం.. మరీ విశేషమైన పరిణామం కాదు గానీ.. తమిళనాట ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ సంక్షుభిత పరిస్థితి నేపథ్యంలో అందులో ఏమైనా ప్రత్యేక సంకేతాలు ఉన్నాయా అనే ఊహాగానాలు కూడా రేగుతున్నాయి. ‘రజనీకాంత్ సంపూర్ణారోగ్యంతో నిండు నూరేళ్లూ జీవించాలంటూ’ మోదీ ట్వీట్ చేశారు.
రజనీకాంత్ ఎన్ని కీర్తి శిఖరాలను అధిరోహించినప్పటికీ.. అభిమాన కోటిని సంపాదించుకున్నప్పటికీ.. తన మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆయనకు ఇంకా గుర్తున్నదని, రజనీ గొప్పదనం అదే అని ఆయన కుమార్తె సౌందర్య అంటున్నారు. ఆయన చాలా సింపుల్ మనిషి అంటూ.. ఆయన పిల్లలుగా తాము మన మూలాలు ఎక్కడ ఉన్నాయనే సంగతి మరచిపోకూడదనే జీవిత పాఠాన్ని నేర్చుకున్నాం అని ఆమె చెప్పారు. రజనీకాంత్ ఇటీవలి చిత్రాల జయాపజయాల గురించి కూడా ఆమె చర్చించారు. రజనీ ఇప్పటికీ సంపూర్ణారోగ్యంతో ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి సందేహాలు అవసరం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా సౌందర్య వివరించారు.