దురదృష్ట వంతుడైన ఆ పెద్ద ప్రొడ్యూసర్‌ ఎవరు?

Update: 2016-09-26 08:51 GMT

ఇప్పుడు తెలుగుతెర మీద పరభాషా చిత్రాల హవా నడుస్తోంది. పెద్ద హీరోలంతా పరభాషా చిత్రాల రీమేక్‌ లకే వెంపర్లాడుతున్నారు. ఇంకో కేటగిరీ కింద, ఏకంగా డబ్బింగ్‌ చిత్రాల వెల్లువ ఎటూ ఉండనే ఉంది. తాజాగా తమిళ, మళయాళ సూపర్‌స్టార్లు ఇద్దరు కలిసి నటించిన చిత్రం మళయాళం నుంచి తెలుగులోకి డబ్బింగ్‌ అవుతోంది. తమిళ స్టార్‌ సత్యరాజ్‌, మళయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ ఇందులో సీబీఐ ఆఫీసర్లు గా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది మళయాళంలో సూపర్‌హిట్‌ సినిమా అని చెబుతున్నారు.

నిజానికి ఈ ఇద్దరు వెటరన్‌ స్టార్‌లు ఉన్నాక అక్కడ సూపర్‌హిట్‌ కాకపోయినా.. తెలుగులో డబ్బింగ్‌కు అర్హత ఉన్నట్లే లెక్క. ఎందుకంటే.. బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్‌కు, జనతా గ్యారేజ్‌ లో ఎన్టీఆర్‌ తండ్రిగా మోహన్‌లాల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణే దక్కింది. ఈ ఆదరణను క్రేజ్‌ను ఇద్దరూ ఇద్దరే చిత్రం క్యాష్‌ చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఓ భారీ చిత్రాల అగ్రశ్రేణి తెలుగు ప్రొడ్యూసర్‌ ఈ చిత్రం డబ్బింగ్‌ హక్కుల కోసం ప్రయత్నించి ఫెయిలయ్యార్ట. ఓ డిస్ట్రిబ్యూటరుకు ఫోను చేసి సినిమా మీద ఒపినియన్‌ అడిగారుట. తప్పకుండా డబ్బింగ్‌ చేయొచ్చునని ఆయన సూచించారుట. అయితే.. ఆలోగానే ప్రస్తుతం సినిమా డబ్‌ చేస్తున్న కృష్ణారెడ్డి హక్కులు తీసేసుకోవడం జరిగిందిట. ఆ పెద్ద ప్రొడ్యూసర్‌ దురదృష్టవంతుడని.. హక్కులు పొందలేకపోయాడని అంటున్నారు. ఈ విషయాన్ని సినిమా ఆడియో ఫంక్షన్‌లోనే అధికారికంగా వెల్లడించారు.

అయితే డబ్బింగ్‌ హక్కులు పొందలేకపోయిన దురదృష్టవంతుడైన సదరు పెద్ద ప్రొడ్యూసర్‌ ఎవరు? ఇది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఆ విషయంలో ఫిలిం సర్కిల్‌ వర్గాల్లో మాత్రం సురేష్‌బాబు, అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌ లాంటి పేర్లు పుకార్లుగా వినిపిస్తున్నాయి.

Similar News