నాగ్ ఫ్యామిలీతో సెకండ్ ఛాన్స్ నిజమే!

Update: 2016-10-13 03:25 GMT

కల్యాణ్‌కృష్ణ అనే యువదర్శకుడు నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం తీశాడు. చాలాకాలం తర్వాత నాగార్జున కు మంచి కమర్షియల్ హిట్‌ను ఆ చిత్రం అందించింది. కొత్త దర్శకుడిగా కల్యాణ్ కృష్ణకు కూడా పేరు వచ్చింది. నాగార్జున మళ్లీ తమ ఫ్యామిలీతోనే రెండో చిత్రం చేసే అవకాశం కల్యాణ్‌కు ఇస్తున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని, కల్యాణ్ ప్రతిభ మీద నాగార్జునకు నమ్మకం లేదని, అసలు సోగ్గాడే పని మొత్తం మరో రచయిత చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. ఇలాంటి ప్రచారంతో దర్శకుడు కల్యాణ్ కెరీర్ మీద నీలనీడలు పరచుకున్నాయి.

అయితే ఇప్పుడు నాగ్ ఫ్యామిలీతోనే కల్యాణ్ తన రెండో చిత్రం చేస్తుండడం ఖరారు అయిపోయింది. నాగచైతన్యతో ఆ చిత్రం ఉంటుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. నాగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ సంగతి చెబుతున్నా సరే.. అంతా పుకార్లే అంటూ ఒక దుష్ప్రచారం కూడా నడుస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆ సంగతి నిజమే అని ఖరారైంది.

నాగచైతన్య- కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందే చిత్రం నవంబరులో ప్రారంభం కాబోతున్నట్లు చైతూ ప్రకటించేశాడు. దాని వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ వారి మరో చిత్రం చేయడానికి కూడా చైతూ ఓకే చెప్పాట్ట. నాగార్జున కు ఇటీవలి కాలంలో మంచి కమర్షియల్ హిట్ అందించిన కల్యాణ్ , చైతూకు ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి.

Similar News