పవన్ కళ్యాణ్ కూడా తన వైఖరి మార్చేశాడు

Update: 2016-10-11 07:10 GMT

నిర్మాతల చేతుల్లో అధికారం ఉన్న పాత రోజులలో నటులు, దర్శకులు తక్కువ వ్యవధిలో ఎక్కువ చిత్రాలు చేసేవారు. సూపర్ స్టార్ క్రిష్ణ అయితే ఏకంగా ఏడాదికి పది చిత్రాలు విడుదల చేసిన సందర్భాలు అనేకం. కానీ ఇప్పుడు నిర్మాత నామమాత్రపు యజమానిగా మిగిలిపోతున్నాడు. హీరోలు, దర్శకుల ఆధిపత్యం చలామణి అవుతున్న రోజులు ఇవి. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే దుస్థితి తప్పించుకోవటానికే పాత తరం నిర్మాతలు ఎందరో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో మహేష్ బాబు, తారక్, అల్లు అర్జున్ వంటి అగ్ర నటులు ప్రతి రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు చిత్రాలు విడుదల చేస్తూ కొంతవరకు నిర్మాతలకు సహకరిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పని చెయ్యటానికి ఎందరో నిర్మాతలు, దర్శకులు కథలతో ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక చిత్ర విడుదల తర్వాత మరో చిత్రం చిత్రీకరణ ప్రారంభం కావటానికి అధిక సమయం పడుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రాజకీయాలలోనూ చురుగ్గా ఉంటున్న పవన్ సినిమాల సంఖ్య ఏడాది ఏడాదికి తగ్గిపోతూ వస్తుంది. కానీ కాటమ రాయుడు చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలు ఎక్కించేసాడు పవర్ స్టార్. తనకు అద్భుతమైన చిత్రాలు అందించిన నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటించబోయే నూతన చిత్రపు పూజ కార్యక్రమాలు ఈ రోజు అన్నపూర్ణ 7 ఆకర్స్ లో జరిగాయి.

ఎ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్.టి.నీసన్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఎ.ఎం.రత్నం, పవన్ కళ్యాణ్ కలయికలో ఖుషి, బంగారం తర్వాత వస్తున్న మూడవ చిత్రం ఇది.

Similar News