పవన్ కళ్యాణ్ తరహాలో ప్రశ్నించటానికి సిద్దమవుతున్న జ్యోతిక

Update: 2016-10-12 05:04 GMT

హీరోల నట జీవితం లా ఏ బ్రేకులు పడకుండా హీరోయిన్ల నట జీవితాలు సాగవు. అటువంటి వారిలో జ్యోతిక ఒకరు. తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకులు వంటి కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున లతో నటించిన జ్యోతిక, తమిళ నటుడు సూర్యని వివాహం చేసుకుని సుదీర్ఘ కాలం రంగుల ప్రపంచానికి దూరంగా ఉన్నారు. జ్యోతిక ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొంత కాలం ఏ సినిమా కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. గత సంవత్సరమే పాత్ర బలం ఉన్న మలయాళ చిత్ర కథను ఎంచుకుని తమిళంలో 36 వయధినిలే లో కనిపించి ఆవిడ నట జీవితాన్ని పునః ప్రారంభించారు.

తాజాగా జ్యోతిక మరో చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రానికి మగలీర్ మట్టుమ్ అనే పేరు ఖరారు చేసి ఫస్ట్ లుక్ ట్విట్టర్లో పంచుకున్నారు ఈ చిత్ర నిర్మాత ఐన జ్యోతిక భర్త సూర్య. ఈ చిత్రంలో జ్యోతిక పాత్రికేయురాలి పాత్ర పోషిస్తున్నారు. కథ మొత్తం ఆవిడ పాత్ర చుట్టూ, ఆవిడ జరిపే కేసు విచారణ చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. కెమెరా మాన్ గంగతో రాంబాబు లో మైక్ పట్టుకుని పవన్ కళ్యాణ్ సామాజిక అంశాలపై ప్రశ్నించిన రీతిలో ఉంటుందో, లేక సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ తో కనిపించే పాత్రికేయురాలిగా ఉంటుందో చూడాలి.

నటుడిగా సూర్య తమిళ తెలుగు భాషల్లో అనేక ఎదురు దెబ్బలు తింటూన్న, కొత్త దర్శకుడు బ్రహ్మ ని నమ్మి జ్యోతిక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో సూర్యకి బాగా కలిసివచ్చిన సింగం సిరీస్ లో మూడవ భాగం సింగం3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఆ చిత్రంతో ఐనా సూర్య కు తన పాత మార్కెట్ తిరిగి వస్తుందో లేదో చూడాలి.

Similar News