పూరీ - క్లయిమాక్స్ కు కిరీటిం దక్కింది!

Update: 2016-10-21 11:04 GMT

పూరీ జగన్నాధ్ సినిమా మీద జనంలో భిన్నాభిప్రాయాలు రావచ్చు.. బాక్సాఫీసు వద్ద దాని ఫలితం ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. అయినంత మాత్రాన పూరీ మేకింగ్ స్టయిల్ గురించి, తాను చెప్పదలచుకున్న విషయాన్న నెరేట్ చేసే తీరు గురించి తప్పులెన్నేవాళ్లుండరు. ఇజం విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమాలో క్లయిమాక్స్ 20 నిమిషాల సినిమా మాత్రం అదరగొట్టేశారు అని.. ఆ 20 నిమిషాల సేపు కల్యాణరామ్ నటన కూడా అద్భుతం అని ప్రత్యేకించి కోర్టు సీన్లలో చాలా చక్కగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు.

పూరీ జగన్ ఈ చిత్రంలో హీరోను జర్నలిస్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. జర్నలిజం మీద సినిమా ఆయనకు కొత్త కాదు. అసలే సామాజికాంశాలపై పదునైన సెటైర్లు సంధించే పూరీ ఇందులో అలాంటిదే మరో ప్రయత్నం చేశాడు. గతంలో పోలీసు పాత్రలను తెరమీద గౌరవంగా చూపించడంలో తనకంటూ ఓ ముద్ర సృష్టించుకున్న పూరీ, జర్నలిస్టులను కూడా అంతే గౌరవంగా తెరమీద చూపించాడని దీంతో పేరు వచ్చింది.

సినిమాను యాక్షన్ మసాలాగా చాలా సాదాసీదాగానే తీశారని అంతా అంటున్నప్పటికీ క్లయిమాక్స్ విషయంలో మాత్రం కిరీటం పెట్టేస్తున్నారు. మంచి క్లయిమాక్స్ ను చూడడానికి కాస్త ఓపికగా సినిమాను మొత్తం చూడాల్సిందే అంటూ నెటిజన్లలో పోస్టులు ప్రచారం అవుతున్నాయి.

మొత్తానికి ఇజం చిత్రానికి రివ్యూలు, గట్రా ఎలా వచ్చినప్పటికీ.. అందరూ మూకుమ్మడిగా క్లయిమాక్స్ ను మెచ్చుకుంటున్నమాట వాస్తవం. అయితే.. చిత్రాన్ని కేవలం క్లయిమాక్స్ నిలబెడుతుందా.. ఆద్యంతమూ మిస్సయిన ఎలిమెంట్లు దెబ్బతీస్తాయా అనేది వేచిచూడాలి.

Similar News