ప్రభాస్ ప్రమేయం లేని యముడు

Update: 2016-10-05 09:37 GMT

తమిళ నటుడు సూర్యకు గజిని తర్వాత ఆ స్థాయి విజయం తెలుగు రాష్ట్రాల్లో తెచ్చిన చిత్రం యముడు. సింగం అనే తమిళ్ సినిమాకు తెలుగు అనువాద రూపం. ఆ చిత్రం ఇరు భాషల్లో ఘన విజయం సాధించటంతో పాటు హిందీ లోనూ రీమేక్ ఐయ్యి అక్కడ కూడా విజయం పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు హరి ఆ చిత్ర కొనసాగింపుగా సింగం 2 ని తమిళ భాషలో చేసి తెలుగులోనూ అనువదించి విజయ పరంపరను కొనసాగించారు. ఇప్పుడు సింగం 3 యముడు 3 గా తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ఈ దీపావళి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే మన కథానాయకులు ఇతర భాషల్లో అతిధి పాత్రలు చెయ్యటం, ఇతర భాషల్లో చిత్రాలకు పాటలు పాడటం వంటివి చేస్తూ ఇతర రాష్ట్రాలలో కూడా మార్కెట్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బాహుబలి చిత్రం పుణ్యమా అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ క్రేజ్ని సూర్య యముడు 3 చిత్రానికి ఉపయోగ పడేలా బాహుబలి చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన జ్ఞానవేల్ రాజా పావులు కదుపుతున్నారని, ఆ చిత్రంలో ప్రభాస్ అతిధి పాత్రలో మెరవబోతున్నారని వార్తలు మద్రాస్ పట్నం అంతటా షికార్లు చేసాయి. జ్ఞానవేల్ రాజా ఈ వార్తకు స్పందిస్తూ యముడు 3 చిత్రంలో ప్రభాస్ ఏ కాక మరే ఇతర హీరో కామియో పాత్ర చెయ్యలేదని తెలియజేసారు.

యముడు 3 చిత్రం లో మొదటి రెండు భాగాలలో నటించిన అనుష్క శెట్టితో పాటు శృతి హాసన్ నటిస్తున్నారు. నీతూ చంద్ర ప్రత్యేక పాటలో కనిపించనుంది.

Similar News