ఫామిలీ, ఫ్రెండ్స్ తో గ్యాప్ ని ఎంజాయ్ చేసాట్ట

Update: 2016-12-12 11:30 GMT

ఐదు ఆరు సంవత్సరాల క్రితం వరకు అగ్ర స్థానంలో వున్న హాస్య నటుల స్థానాలు అతలాకుతలం అయ్యాయి. సునీల్ కథానాయకుడిగా స్థిరపడిపోగా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఏ.వి.ఎస్ వంటి పలువురు ప్రముఖ హాస్య నటులు అతి తక్కువ కాల వ్యవధిలో కాలం చెందారు. కృష్ణ భగవాన్, రఘు బాబులు సినిమాల సంఖ్య తగ్గించుకోగా బ్రహ్మానందం హాస్యం మొనాటనీ రావటంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా ప్రతి వారి స్థానం దిగువ స్థాయికి చేరిపోవటానికి కారణాలు వున్నాయి కానీ, ప్రముఖ హాస్య నటుడు అమాంతం అదృశ్యమవటానికి కారణం ఎవరికీ తెలీదు.

గత కొద్ది కాలంగా వెండితెర కు దూరం అయిన నటుడు వేణు మాధవ్. ఇటీవలి కాలం లో ఆయనకు, ఆయన కుటుంబాన్ని మానసిక క్షోభ పెట్టిన కొన్ని వార్తలు ప్రసారం చేసిన సంస్థల పై, వాటి వెనుక వున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. తరువాత ఆయన ఒక ఇంటర్వ్యూ లో తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. "వరుస సినిమాలు చేస్తూ అకస్మాత్తుగా కనుమరుగైన నటుడిగా అందరూ నా మీద సానుభూతి చూపుతుండటం నాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. నేను ఈ గ్యాప్ ని అప్పటివరకు సినిమాలతో మిస్ ఐన నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఇక ఇప్పుడు మళ్లీ వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వనున్నాను. 2017 లో విడుదల దిశగా చిత్రీకరణ జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు చిత్రం నా రీఎంట్రీ చిత్రం కాబోతుంది. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలలో నటించటానికే ప్రయత్నిస్తాను." అని సెలవిచ్చాడు వేణు మాధవ్.

Similar News