అలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటున్న యువ కథానాయిక హెబ్బా పటేల్ ఇప్పుడు నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించటానికి సిద్ధమైపోయింది. ప్రముఖ మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దగ్గర దర్శక బృందంలో పని చేసిన భాస్కర్ బండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తండ్రి కూతుర్ల మధ్యన వుండే అనుబంధాన్ని ఆవిష్కరించే కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కి ముద్దుల ప్రేయసిగా అలరించనుంది. పలు చిత్రాల వాయిదాల నేపథ్యంలో ఈ నెల 16 న థియేటర్లు దొరకడంతో ప్రీ పోనే చేసుకుని మరీ విడుదల తేదీ ఖరారు చేశారు అంటేనే ఈ చిత్రం పై నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది.
కథానాయిక హెబ్బా పటేల్ ఈ చిత్ర విషయాలు పంచుకుంటూ, తన నిజ జీవితానికి ఈ చిత్ర పాత్రను అన్వయించటం కుదరని కుదరదు అని చెప్పింది. "నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో నేను పల్లెటూరి వాతావరణంలో పెరిగి పట్టణానికి వచ్చే పద్మావతి పాత్రను పోషిస్తున్నాను. నేను ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో సన్నిహితంగా వుంటూ నేను చేసిన ఒక తప్పును సరిదిద్దే తండ్రి పాత్రలో రావు రమేష్ కనిపిస్తారు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. అయితే ఈ చిత్రంలో నేను పోషించిన పాత్రకు నా నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదు. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేసే పాత్ర నాది. నిజ జీవితంలో అసలు బాయ్ ఫ్రెండ్ తో తిరిగే సమయం ఎక్కడ వుంది అండి?" అని వాపోతుంది హెబ్బా పటేల్.
ప్రస్తుతం హెబ్బా పటేల్ ఏంజెల్, మిస్టర్, అందగాడు అనే మూడు చిత్రాలలో నటిస్తుంది. ఈ మూడు చిత్రాలు 2017 లో విడుదల అవుతాయి.