రఘువరన్ భార్య కు సినిమా కష్టాలు

Update: 2016-12-13 15:10 GMT

పాత తరంలో సినిమా నిర్మాణం అంటే అతి కష్టమైన పనిగా భావించేవారు. నటీనటుల కాల్ షీట్స్ దొరికినప్పుడు అనుకున్న లొకేషన్ లో ఇతర షూటింగ్ లు జరుగుతుండటం, లొకేషన్ సెట్ అయ్యాక యాక్టర్స్ కాంబినేషన్ సన్నివేశాలకు కాల్ షీట్లు దొరకకపోవడం, రీళ్ళతో చిత్రాన్ని బంధించే కాలం కావటంతో తలకు మించిన భారంగా వ్యయం అధికం అయిపోవటం వంటి అనేక కష్టాలకు ఓర్చి ఒక నిర్మాత చిత్రం నిర్మించాల్సి ఉండేది. అందుకే ఆ రోజుల్లో నిర్మాతకు ఎక్కువ గౌరవం దక్కుతుండేది. ఇప్పుడు లొకేషన్స్, యాక్టర్స్ డేట్స్ కష్టాలు ఉన్నప్పటికీ సినిమా మేకింగ్ మొత్తం డిజిటలైజ్ అయిపోవటంతో నిర్మాణ ప్రక్రియ సులభ దాయకంగా మారిపోయింది. కానీ విడుదల చేయటానికి చిన్న చిత్రాల నిర్మాతలకు తల ప్రాణం తోకకి వచ్చేస్తోంది.

తమిళంలో అప్పవిన్ మీసై అనే చిత్రాన్ని నటుడు రఘువరన్ భార్య, డబ్బింగ్ ఆర్టిస్ట్ సీనియర్ నటి రోహిణి దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రం ఒక అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనలో ప్రదర్శితమై అక్కడి విమర్శకుల మన్ననలు పొందింది. అయినా ఈ చిత్రం విడుదలకు పరిశ్రమ సహకారం అందటం లేదు. ఈ చిత్రం విడుదలకి ఇంకా నలభై లక్షలు అవసరం పడటంతో క్రౌడ్ ఫండింగ్ సేకరిస్తున్నారు ఈ చిత్ర బృందం. కన్నడలో లూసియా అనే చిత్రం కూడా ఇలా క్రౌడ్ ఫండింగ్ సహకారంతో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. లూసియా దర్శకుడు పవన్ కుమార్ రోహిణి కి చాలా సన్నిహిత స్నేహితుడు కావటంతో ఆయన ప్రోద్బలంతో ఈ రూపేణా ఫండ్స్ రైజ్ చేసుకుంటుంది పాపం. మంచి చిత్రాలను ఆరాధించే చిత్ర పరిశ్రమగా పేరున్న తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఈ గడ్డు పరిస్థితి ఎదురుకావడం విషాదకరం.

Similar News