రష్మీ గౌతమ్ స్థానంలో సన్నీ లియోన్

Update: 2016-10-03 05:48 GMT

జాతీయ పురస్కార గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అడల్ట్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు టాకీస్ ఆర్ధిక లాభాలు తెచ్చిన విషయం విదితమే. సినీ విశ్లేషకులు, విమర్శకులు మాత్రం చందమామ కథలు వంటి జాతీయ పురస్కారం పొందిన చిత్రం చేసిన యువ దర్శకుడి నుంచి ఆశించిన స్థాయి కథ కథనాలు ఏమి లేవు అని, కేవలం బూతు మాటలు, చేష్టలతోనే కథనాన్ని నడిపారు అని పెదవి విరిచారు. విమర్శకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇప్పుడు గుంటూరు టాకీస్ చిత్రానికి కొనసాగింపుగా గుంటూరు టాకీస్ 2 తెరకెక్కబోతుంది.

గుంటూరు టాకీస్ చిత్రం లో బుల్లి తెర యాంకర్ రష్మీ గౌతమ్ పాత్రకి కథానుసారం ప్రాముఖ్యత లేనప్పటికీ ఆవిడ అందాల ఆరబోత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటానికి ఉపయోగపడింది. ఆ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ రష్మీ గౌతమ్ సినిమా కి ఎంత సహకరించినా ఆవిడ పరిధి తక్కువ అని భావించారో ఏమో, గుంటూరు టాకీస్ 2 చిత్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సన్నీ లియోన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. సన్నీ లియోన్ తో నటింపచేస్తే ఆ చిత్రానికి హిందీ మార్కెట్ కూడా బాగా దక్కుతుంది అనేది నిర్మాత ఆలోచన.

గుంటూరు టాకీస్ మొదటి భాగం లో నటించిన సిద్దు స్థానంలో కూడా హిందీ తెలుగు మార్కెట్లకు దోహదపడే నటుడిని అన్వేషిస్తున్నట్టు సమాచారం. మొదటి భాగం నిర్మించిన రాజ్ కుమార్ ఈ కొనసాగింపు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.

Similar News