రాజు కంట్లో మరో తమిళ చిత్రం పడింది

Update: 2016-10-04 11:28 GMT

మన అగ్ర కథానాయకులకు బైట రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ పరిధితో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలలో సాధారణ స్థాయి తమిళ నటులకు ఉన్న మార్కెట్ చాలా ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాలలో ఘన విజయం నమోదు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం కూడా తమిళనాడులో కోటి రూపాయల వసూళ్లు చెయ్యలేకపోయింది. కానీ కమల్ హాసన్, రజని కాంత్, చియాన్ విక్రమ్, సూర్య, ధనుష్, కార్తీ, విశాల్, జీవ, ఈ మధ్య కాలంలో ఆ కోవలోకి చేరిన విజయ్ ఆంథోనీ.. ఇలా ఎందరో అరవ నటులు ఇక్కడ అధిక వసూళ్లు సాధించిన వాళ్ళే. ఈ విషయమై దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. కానీ ప్రేక్షకులు చూస్తున్నంత కాలం ఎవరూ ఈ సంస్కృతిని మార్చలేరు.

ఇప్పుడు శివ కార్తికేయన్ అనే మరో కథానాయకుడు రెమో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని అనువదించి తెలుగులో విడుదల చెయ్యబోతున్నారు. గతంలో శివ కార్తికేయన్ నటించిన మాన్ కరాటే చిత్రాన్ని తెలుగులో నారా రోహిత్ నటించి తుంటరి గా విడుదల చెయ్యగా ఆ చిత్రం ఘోర నష్టాలను మిగిల్చింది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న నేను లోకల్ చిత్రంలోనూ కీర్తి సురేషే కథానాయిక.

2015 లో మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఓ కాదల్ కన్మణి ని తెలుగులో ఓకే బంగారం గా విడుదల చేసి విజయవంతమై ఇప్పుడు తమిళంలో రెమో పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి యోచిస్తున్నారు దిల్ రాజు. దిల్ రాజు విడుదల చేస్తున్న చిత్రం అంటే ప్రచారం భారీ స్థాయిలోనే ఉంటుంది. మరి ఈ అరవ కుర్రాడు మన మార్కెట్ మీద ఏ మేర ప్రభావం చూపుతాడో చూడాలి.

Similar News