వంగవీటితో వర్మ చేస్తున్న ప్రయత్నం ఏంటి?

Update: 2016-10-03 06:39 GMT

క్షణం తీరిక లేకుండా హైదరాబాద్ ముంబై లలో తన సినిమాలు, ట్వీట్లు, ఇంటర్వ్యూలు, వివాదాలతో సతమతమయ్యే రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం వంగవీటి కి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. చిత్రీకరణ మొదలు కావటానికి ముందే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో "వంగవీటి విడుదల ఐన తర్వాత రక్త చరిత్ర పిల్లల చిత్రం అనిపిస్తుంది" అని వ్యాఖ్యానించారు. తాజాగా విడుదల ఐన ప్రచార చిత్రం లో విషయం ఉన్నప్పటికీ రక్త చరిత్ర ప్రచార చిత్రాల స్థాయి సంచలన రీతిలో అయితే కనిపించలేదు. వర్మ సినిమాలో చూపించి ప్రేక్షకులను అబ్బుర పరచటానికి ప్రచార చిత్రంలో అటువంటి ఛాయలు ఏమి కానరానివ్వకుండా జాగ్రత్త పడ్డారు అనిపిస్తుంది.

రక్త చరిత్ర, 26/11 అటాక్స్, కిల్లింగ్ వీరప్పన్, ఇప్పుడు వంగవీటి ఇలా ప్రతిసారి నిజ జీవితపు సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ప్రతి చిత్రంతోనూ వర్మ తన ముద్ర వేస్తున్నారు. అయితే చలసాని వెంకట రత్నంతో మొదలుకొని వంగవీటి అన్నదమ్ముల ఎదుగుదల నుంచి మరణం వరకు రెండు గంటలలో వర్మ ఎలా చెప్తాడా అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 1970, 80 ల నాటి బెజవాడ పరిస్థితులు ఇప్పుడు ఆవిష్కరించే ప్రయత్నం చేసిన వర్మ ఉద్దేశం ఒక్క వర్మకి తప్ప ఎవరికీ అంతుపట్టదు.

రాష్ట్ర ప్రజలకు తెలిసిన కథే అయినప్పటికీ ఎన్ని తెలియని కోణాలను వర్మ చూపిస్తాడో తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. కాబట్టి చిత్రం ఎలా ఉండబోతున్నా ఆర్ధిక లాభాలు ఖాయంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రిష్ణా జిల్లాలో అధిక ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Similar News