సంగీత దర్శకుల ఫైట్ : కావలిస్తే కేసు వేస్కో

Update: 2016-10-15 09:35 GMT

ప్రతి సంగీత దర్శకుడు తన అభిరుచికి తగ్గ సంగీతాన్ని ఎక్కువ ఆలపిస్తుండటంతో వారు సమకూర్చే స్వరాలలో వారిని ప్రభావితం చేసిన స్వరాల ఆనవాళ్లు కనిపిస్తుండటం సర్వ సాధారణమైన విషయం. ఈ ప్రక్రియను అనుసరించటం అనో మక్కికి మక్కి దించటం అనో విమర్శిస్తే ఆ విమర్శలను పట్టించుకోరు సంగీత దర్శకులు. వారి పని తీరు పై వారికి వుండే విశ్వాసం వలన ఐయి ఉండొచ్చు. కానీ శ్రోతల నుంచో, లేక విశ్లేషకుల నుంచో వచ్చే విమర్శలు కాక, తోటి సంగీత దర్శకుడి నుంచి ఆ ప్రశ్న ఎదురైతే?? ఇదే పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్ లో ఇద్దరి సంగీత దర్శకుల మధ్య అభిప్రాయ భేదాలకు, మనస్పర్థలకు తావిచ్చింది.

ఎం.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ చిత్ర సంగీత దర్శకుడు అమల్ మల్లిక్ తన ట్విట్టర్ ద్వారా అజయ్ దేవగన్ నటిస్తున్న శివాయ్ చిత్ర సంగీత దర్శకుడు మిథున్ ని సూటిగా ప్రశ్నించాడు. "నేను మిథున్ సంగీతానికి అభిమానినే. కానీ నేను స్వరపరచిన మైరాహుం యా నహి రాహు పాటకు సంబంధించిన ఒక బిట్ ను ఏ మార్పు లేకుండా మీరు వాడాల్సిన అవసరం మీకు ఎందుకు కలిగింది?" అని మిథున్ ని బహిరంగంగానే ఇరకాటంలో పడేసాడు అమల్ మల్లిక్.

ఈ వివాదం నెత్తికి ఎక్కించుకోకూడదు అనుకున్నాడో ఏమో శివాయ్ సంగీత దర్శకుడు మిథున్ వారం రోజుల పాటు మౌనం వహించాడు. కానీ అమల్ మల్లిక్ చేసిన ఈ ట్వీట్ కి ఫాలోయర్స్ పెరుగుతుండటంతో ఈ ప్రశ్నకు పరోక్ష సమాధానమిచ్చాడు మిథున్. "ఈ రోజే శివాయ్ కి సంబంధించిన సంగీత కార్యక్రమాలు అన్ని దిగ్విజయంగా ముగిసాయి. నా పని తీరుపై ఎటు వంటి అనుమానం ఉన్నా, లేక నా స్వరాలూ ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించినా వారు నిరభ్యంతరంగా నా పై కేసు వేయొచ్చు." అని ట్వీట్ చేసి అమల్ మల్లిక్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సవాల్ విసిరాడు మిథున్.

Similar News