సినిమాల వైఫల్యాలు నన్ను ఆపలేవు

Update: 2016-10-05 10:36 GMT

జాతీయ పురస్కార గ్రహీత ఐన నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన శైలి లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ధోని, ఉలవచారు బిర్యానీ తర్వాత ఆయన నిర్మాణంలో ఆయనే దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు ఆర్ధిక లాభాలు తీసుకురానప్పటికీ, తనదైన శైలిలో వైవిధ్య కథలను చెప్పే దర్శకుడిగా మాత్రం ప్రకాష్ రాజ్ కు అటు పరిశ్రమ వర్గాల్లోనూ, ఇటు సినీ విశ్లేషకులలోను గుర్తింపు తెచ్చిపెట్టాయి. మన ఊరి రామాయణం లో ఏ పాత్ర గొప్పతనం ఆ పాత్రదేనని ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్నే తెరపై చూసుకున్న అనుభూతి పొందుతారని నమ్మకంగా చెప్పారు ప్రకాష్ రాజ్.

సినీ జీవితంలో ప్రస్తుత తన పరిస్థితిని వివరిస్తూ, సమర్ధిస్తూ "ఇప్పుడు నేను కేవలం నటనకు పరిమితమైన వ్యక్తిని కాదు. నిర్మాతగా మారి నా అభిరుచులకు తగ్గ చిత్రాలను నిర్మిస్తున్నాను. అలానే దర్శకుడిగా మారి నేను ఏ కోణంలో కథను అర్ధం చేసుకుంటానో అదే కోణంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాను. అయితే ఈ ప్రయాణంలో నాలోని నిర్మాతకు నాలోని నటుడి మద్దతు ఉంటుంది. అలానే నాలోని దర్శకుడికి నాలోని నిర్మాత ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. దర్శకుడిగా వైఫల్యాలు ఎదుర్కొన్నంత మాత్రాన దర్శకత్వం నుంచి వైదొలగను. మంచి కథలను నాదైన ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తూనే ఉంటాను." అని వివరించారు ప్రకాష్ రాజ్.

మన ఊరి రామాయణం ఈ నెల 7 వ తారీకున విడుదల కానుంది. ప్రియమణి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ గత రెండు చిత్రాలతో పోలిస్తే మన ఊరి రామాయణం భారీ స్థాయిలో విడుదల అవుతుంది.

Similar News