'సెల్ఫీరాజు'గా అల్లరోడు...?

Update: 2016-03-14 14:36 GMT

కామెడీకి రాజేంద్రప్రసాద్‌ తర్వాత కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న కామెడీ కింగ్‌ అల్లరినరేష్‌. మినిమం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వచ్చిన ఆయనకు మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరే వచ్చింది, నిర్మాతలు, బయ్యర్లు కూడా ఈ హీరోని మినిమం గ్యారంటీ హీరోగా భావిస్తూ రావడంతో ఆయన ఏడాదికి ఆరేడు చిత్రాలు చేస్తూ వచ్చాడు. కానీ ఈమధ్య కాలంలో అల్లరినరేష్‌కు టైమ్‌ కలిసి రావడం లేదు. ఆయన చిత్రాలన్నీ ఎప్పుడు వస్తున్నాయో? ఎప్పుడు పోతున్నాయో? కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అల్లరోడి దూకుడు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆయన ఏడాదికి రెండు మూడు చిత్రాలు కూడా చేయలేకపోతున్నాడు. ఇటీవల వచ్చిన ఆయన తన 50వ చిత్రం 'మామ మంచు... అల్లుడు కంచు' అనే చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అది కూడా ఆయన్ను కాపాడలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ సైలెంట్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా సాగిపోతోంది. కాగా ఈ చిత్రానికి 'సెల్ఫీరాజు' అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లో ఈ చిత్రం టైటిల్‌ను దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈచిత్రం అయినా ఆయనకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందో లేదో చూడాల్సివుంది...!

Similar News