Devil Movie Review: 'డెవిల్' సినిమా రివ్యూ
పీరియాడిక్ డ్రామాతో సినిమా అంటే చాలు ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది
Devil Movie Review: పీరియాడిక్ డ్రామాతో సినిమా అంటే చాలు ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా సస్పెన్స్, యాక్షన్ కూడా అంటే ఇలాంటి సబ్జెక్టును డీల్ చేయడం కొంచెం రిస్కీగానే ఉంటుంది. అలాంటి సినిమానే 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించారు. తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ ఎంపికలకు నందమూరి కళ్యాణ్ రామ్ కు మంచి పేరు ఉంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా డెవిల్ కు "ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్" అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ నామా దర్శకుడు, నిర్మాత. అయితే ఈ సినిమాకు దర్శకత్వం విషయంలోనే చాలా చర్చ.. ఊహించని రచ్చ కూడా జరిగింది. చివరికి ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా డైరెక్షన్ చేశానని చెప్పుకుని సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఆ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో చూద్దాం.
కథ:
బ్రిటీష్ ప్రావిన్స్‌లోని రసపాడులో జమీందార్ కుమార్తె విజయ (అమ్ము అభిరామి) అనుకోని విధంగా హత్యకు గురవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం మర్డర్ మిస్టరీని చేధించమని ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్)ని ఆదేశిస్తుంది. రసపాడు చేరుకున్న తర్వాత డెవిల్ చాలా షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. ఈ హత్య కోసం మాత్రమే సీక్రెట్ ఏజెంట్ ను ఎందుకు రంగంలోకి దింపారా అనే అనుమానాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. కొంత సమయం తరువాత, డెవిల్‌కి "ఆపరేషన్ టైగర్ హంట్" అనే మరో మిషన్ ఇస్తారు. ఈ కొత్త మిషన్ దేనికి సంబంధించినది? అసలు జమీందార్ కూతుర్ని ఎవరు చంపారు? విజయ హత్యకు కొత్త మిషన్‌కి సంబంధం ఏమిటి? మన హీరో నిజంగానే బ్రిటీషర్ల కింద పని చేస్తూ ఉంటాడా.. అసలు పట్టుకోవాలని అనుకుంది ఎవరిని.. విడిపించాలని అనుకుంది ఎవరిని.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!!
మిగతా విషయాలు:
డెవిల్ సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది. చాలా పాత్రలలో ఊహించని డెప్త్ దాగి ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాస్తా దేశభక్తి భావనతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హీరో మర్డర్ ను చేధించే విధానం కాస్త ఎంగేజింగ్ గా ముందుకు వెళుతుంది. సెకండాఫ్‌లోని ట్విస్టులు కథలో భాగంగా ఉంటాయి. ఊహించని థ్రిల్ ను అయితే ఇవ్వలేవు. ట్విస్టులే కాకుండా వాటిని రివీల్ చేసిన విధానం కూడా పర్వాలేదనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ తన పాత్రలో ఉండే వేరియేషన్స్ ని చక్కగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్, VFX వర్క్స్ బాగున్నాయి. సంయుక్తా మీనన్ తన పాత్రలో ఒదిగిపోయింది. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంది. వశిష్ట సింహ ఆకట్టుకున్నాడు, మాళవిక నాయర్, షఫీ, ఇతర పాత్రలు పర్వాలేదనిపించాయి.
మొదటి గంట పూర్తయ్యే సమయానికి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. మర్డర్ మిస్టరీ కాస్తా సుభాష్ చంద్ర బోస్ ఆగమనం గురించి షిఫ్ట్ అవుతుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమాలో ఊపును తగ్గిస్తాయి. మొదటి సగంలో పెద్దగా సాగతీత సన్నివేశాలుగా అనిపిస్తాయి. సాంగ్స్ కేవలం సిచ్యువేషన్ పరంగా ఉన్నా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మాస్ ఆడియన్స్ కు 'రోసీ' సాంగ్ నచ్చవచ్చు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే భావన ఉండకపోవచ్చు. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బింబిసార రేంజి టాక్ ను సినిమా సొంతం చేసుకుని ఉండేది.
హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే పర్వాలేదు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఆర్ట్‌వర్క్ విషయంలో బాగా మేనేజ్ చేశారు. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బాగున్ను. క్లైమాక్స్ కోసం బాగా కష్టపడ్డారు. అది స్క్రీన్ మీద కనిపించింది. డైరెక్షన్ పరంగా వండర్స్ అయితే సినిమాలో కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్:
ప్రీ క్లైమాక్స్,
యాక్షన్ సన్నివేశాలు,
కళ్యాణ్ రామ్
మైనస్:
సాంగ్స్,
కొన్ని అనవసర సన్నివేశాలు
డెవిల్ మూవీ రేటింగ్: 2.75/5