Look Back : 2024 లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఏం చెబుతున్నాయ్?
ఈఏడాది జరిగిన ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి వరకూ అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు తిరస్కరించారు.
ఈఏడాది జరిగిన ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పటి వరకూ అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి మహాకూటమిగా బరిలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టులు పార్టీలు కలసి పోటీ చేశాయి.అయితే 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైసీపీ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. తాము ఐదేళ్లపాటు అమలు చేసినహామీలు,ఇచ్చినసంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని వైసీపీ అధినేత జగన్ భావించారు. అదే సమయంలో కూటమిగా ఏర్పాటుకావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను జనం అంతేస్థాయిలో నమ్మారు.
చంద్రబాబుపై సానుభూతి...
స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచడంతో ఆయన పై సానుభూతి పెల్లుబికిందంటారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే జనసేనఅధినేత పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లి కలసి వచ్చిజైలు బయటే పొత్తు ప్రకటన చేశారు. అప్పటి నుంచిపవన్ కల్యాణ్ మూడు పార్టీలు కలసి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మూడు పార్టీలు కలసి పోటీ చేశాయి. 175 అసెంబ్లీ నియోజవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కూటమి పార్టీలు మూడు కలసి 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. 22 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అదే సమయంలో వైసీపీకి కేవలం పదకొండుశాసనసభ స్థానాలకు మాత్రమే పరిమితమయింది.
ఈవీఎంలపై నెపం మోపినా...
వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడానికి జగన్ నిర్ణయాలే కారణమంటారు. కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టడం, అభివృద్ధిని విస్మరించడంతో పాటు ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు కూడా కూటమి విజయానికి కారణాలుగా చెబుతారు. మరోవైపు చంద్రబాబు పై సానుభూతి, మోదీ, పవన్ కల్యాణ్ ల చరిష్మాఈసారి బాగా పనిచేసిందంటారు. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు ఎప్పటిలాగానే శాసనసభలో కాలుమోపలేకపోయాయి. ఏపీకి రాజధాని అనేది లేకుండా చేయడం, మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం వంటివి కూడా జగన్ పార్టీ ఓటమికి కారణాలుగా విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఎన్నికలఫలితాల తర్వాత సహజంగానే ఎప్పటిలాగానే వైసీపీ ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ వాదనను తోసిపుచ్చింది. ప్రజాభిప్రాయం మేరకే ఫలితాలు వస్తాయని తేల్చిచెప్పింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో....
మరోవైపు తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 2023 వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలుండగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. అదే సమయంలో ఎంఐఎంకు ఒక్కస్థానమే లభించింది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజవర్గాల్లో ప్రచారం విస్తృతంగా నిర్వహించినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పటి నుంచి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికలు కారు పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు కలిగించాయి.