America : ట్రంప్ వైట్ హౌస్ కు వచ్చే టైం దగ్గరపడింది... సర్దుకోవాల్సిందేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో భారత్ అనుకూల వైఖరి ఉంటుందన్న అభిప్రాయంవ్యక్తమవుతుంది

Update: 2024-12-12 12:21 GMT

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారన్న దానిపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతుంది. కొన్ని దేశాలు బహిరంగంగా, మరికొన్ని దేశాలు పరోక్షంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మద్దతును ప్రకటిస్తాయి. కానీ చివరకు అమెరికన్లు ఎవరిని ఎన్నుకోవాలన్నది నిర్ణయించుకుంటారు. అనేక అంశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో పనిచేస్తాయని జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఒకసారి గెలిచి, రెండోసారి ఓడి, మూడో సారి మళ్లీ గెలిచి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు.



 


రెండోసారి ఓడించి...
నాడు హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి కమలాహారిస్ ను ఓడించి వైట్ హౌస్ లోకి కాలుమోపుతున్నారు. ఓడిపోయానని కుంగిపోకుండా రాజకీయాలకు దూరం కాకుండా ప్రజలను దగ్గరకు చేర్చుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అయ్యారు. చుట్టూ ఉన్న బృందం ఆయన గెలుపునకు కారణమయింది. ట్రంప్ అమెరికన్ల మనసు దోచుకోవడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా వలసలను అరికడతానని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పిన మాటలను అమెరికన్లు విశ్వసించారు. ఇతర దేశాల నుంచి వచ్చే వలసలను ఆపి అమెరికన్లకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తానని ప్రకటించడం ఆయన విజయానికి ప్రధాన కారణంగా చెప్పాలి.
తీవ్రమైన పోటీ...
డెమొక్రాట్ లను కాదని రిపబ్లికన్ పార్టీ ని గతంలో ఎన్నడూ లేని విధంగా వన్ సైడ్ విక్టరీని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించారంటే ఎన్నో విషయాలు ఇందులో కీలకంగా మారాయి. జోబైడన్ పై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేసిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ దే పై చేయి అయింది. ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అంచనాలు, సర్వేలు కమలా హారిస్ కు అనుకూలంగా వచ్చినప్పటికీ చివరకు ట్రంప్ విజయం సాధ్యమయింది. ట్రంప్ అమెరికన్లకు ఇచ్చిన హామీలను బలంగా పనిచేశాయి. డెమొక్రాట్ల పాలనలో బంగ్లాదేశీయులకు ఎక్కువ అమెరికాలో వచ్చేందుకు అవకాశం కల్పించారన్న అసంతృప్తి కూడా అమెరికన్లలో కనిపించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయినా జనవరిలో పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ట్రంప్ రాకతో భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు గండిపడే అవకాశాలున్నాయి. మొత్తం మీద అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివర వరకూ ఉత్కంఠ భరితంగా జరిగాయనే చెప్పాలి.



Tags: