Congress : కేసీఆర్ సర్కార్ ను సాగనంపండి
అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఆయన నల్లగొండ సభలో ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ప్రతి పనిలో అవినీతి జరిగిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి పనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. చివరకు దళితులకు దక్కాల్సిన సొమ్మును కూడా డైవర్ట్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఏ పథకాన్ని అయినా ప్రారంభిస్తాడు తప్పించి పూర్తి చేయడని మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే కేసీఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
కాంగ్రెస్ అందరిదీ...
కాంగ్రెస్ దళితులు, నిరుపేదలు, మైనారిటీల కోసం అనునిత్యం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే కేసీఆర్ ను త్వరగా ఈ పదవి నుంచి దింపేయాలని ఖర్గే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వెంటనే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారమిస్తే అందరికీ మంచి జరుగుతుందని, కేసీఆర్ కు అధికారమిస్తే కొందరికే మంచి జరుగుతుందని ఆయన అన్నారు.
ఇద్దరిదీ ఒక్కటే మనస్తత్వం...
కేసీఆర్, మోదీల మనస్తత్వం ఒక్కటేనని అన్న ఖర్గే వారికి పేదల కంటే కార్పొరేట్లకు లాభించడమే ముఖ్యమని అన్నారు. కేసీఆర్, మోదీ వల్ల ఏ వర్గానికి న్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచాలని, ప్రజల ఆకాంక్షలను తాము మాత్రమే నెరవేరుస్తామని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఐక్యంగా పోరాడి కాంగ్రెస్ ను గెలిపించుకుందామని ఖర్గే పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లాలో పన్నెండు మంది అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నేతలందరూ ఐకమత్యంగా కొనసాగాలని ఆయన కోరారు.