Telangana Elections : జగన్ బాటలోనే మేము కూడా.... అదే సక్సెస్ దారి అట
తెలంగాణలోని అన్ని పార్టీలూ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెబుతున్నారు;
తెలంగాణలోని అన్ని పార్టీలూ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెబుతున్నారు. ఏపీలో ఈ విధానాలు సక్సెస్ కావడంతో ఇక్కడ కూడా అదే తరహా విధానాలను అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తో పాటు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా జగన్ ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను అంగీకరిస్తున్నాయి. ప్రజల్లోకి బలంగా వెళ్లిన పథకాలను, విధానాలను తీసుకెళ్లేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని ప్రామిస్ లు చేస్తున్నాయి.
పింఛను దశలవారీగా...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పింఛను, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలను విడతల వారీగా పెంచుకుంటూ వెళతామని చెప్పారు. పింఛను మొత్తాన్ని ఐదేళ్లలో ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఏడాది కొంత మొత్తం చొప్పున పెంచుకుంటూ వెళతామని ఆయన మ్యానిఫేస్టో విడుదల సందర్భంగా చెప్పారు. అలాగే రైతు బంధు పథకం మొత్తాన్ని కూడా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్లి పదహారు వేలు చేస్తామని చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానంలోనే తాము కూడా పింఛన్లను పెంచుతూ వెళతామని కేసీఆర్ మ్యానిఫేస్టో విడుదల సందర్భంగా చెప్పడం విశేషం.
వాలంటీర్ వ్యవస్థను...
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ విధానాలకు వంతపాడింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటరీ వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పింది. సాక్షాత్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనగామ నియోజకవర్గం సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను అమలులోకి తెస్తామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. అదే సమయంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావించి కాంగ్రెస్ ఈ మేరకు జగన్ అక్కడ అమలు పరుస్తున్న హామీని ఇక్కడ కూడా చేస్తామని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో ఏపీ విధానాలను అమలు పరుస్తామని చెబుతుండటం అక్కడి వైసీపీ నేతలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చి పెడుతున్నాయి.