Telangana Nominations : వీళ్లందరికీ గెలుపు కాదట... మెజారిటీయే ముఖ్యమట
ఈరోజు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లంతా తమ అడ్డాలోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా ఒకరోజు మాత్రమే సమయం ఉంది. ఈరోజు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లంతా తమ అడ్డాలోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. అందరూ ఒకసారి కాదు అనేకసార్లు గెలిచిన వాళ్లే కావడం విశేషం. ఒక్కొక్కరూ నాలుగైదు.. కాదు..కాదు..ఏడెనిమిది సార్లు కూడా గెలిచి నియోజకవర్గంలో తమకు తిరుగులేదని నిరూపించుకున్న వాళ్లే. వాళ్లంతా నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో వారి విజయం ముందే ఖరారయినట్లేనని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నామినేషన్ల ప్రక్రియ నామమాత్రమేనన్నది అందరికీ తెలిసిందేనని చెబుతున్నారు.
మూడోసారి గెలుపు కోసం...
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈరోజు గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి అక్కడ విజయానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకేనన్న భావన అందరికీ కలుగుతుంది. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరసగా విజయం సాధించారు. అంతకు ముందు సిద్ధిపేట నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్ 2014 నుంచి గజ్వేల్ కు తన మకాం ను మర్చారు. ఈరోజు ఆయన గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేయనుండటంతో గెలుపుపై పెద్దగా సందేహం లేకపోయినా మెజారిటీ విషయంలోనే ఆలోచించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుని...
ఈరోజు మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కేటీఆర్ సిరిసిల్లను తన కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్నారు. 2009లో తొలిసారి సిరిసిల్ల నుంచి పోటీ చేసి విజయం సాధించిన కేటీఆర్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరసగా నాలుగు సార్లు సిరిసిల్ల నుంచి జెండాను ఎగరేశారు. 2009, 2010 ఉప ఎన్నికలోనూ, 2014, 2018 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయన గెలుపుపై కూడా ఎటువంటి సందేహం లేదు. కేవలం మెజారిటీ ఎంతన్నదే తేలాలన్నది గులాబీ పార్టీల నేతల ఆలోచన. మెజారిటీ ఎక్కువ తేవాలన్న ఆలోచనతోనే వారంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కావడంతో సిరిసిల్లకు ఈ ప్రాధాన్యత ఏర్పడింది.
అడ్డాగా చేసుకుని...
హరీశ్ రావు.. సిద్ధిపేటలో ఎదురులేని నేతగా కొనసాగుతున్నారు. అప్రతిహత విజయాలతో ఆయన అన్నింటిలో దూసుకు వెళుతున్నారు. కేసీఆర్ మేనల్లుడు కావడం అదనపు బలం. అందుకే హరీశ్ ను ఓడించే మొనగాడు ఎవరూ లేరని ఆ పార్టీ నేతలే అంటారు. సిద్ధిపేట నియజకవర్గంలో హరీశ్ ఆరుసార్లు విజయం సాధించారు. ఆరుసార్లు భారీ మెజారిటీతో్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గంగా రికార్డులకు ఎక్కింది. హరీశ్ సిద్ధిపేట నుంచి 2004 ఉప ఎన్నిక, 2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో ఆయనను సిద్ధిపేట ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి ఆదరించారు. అభివృద్ధిని కూడా అలానే చేశారంటారు. అందుకే తన అడ్డాగా మార్చుకున్నారు. సిద్ధిపేటలో హరీశ్ గెలుపు నామమాత్రమే. అయితే ఆయనకూడా నామినేషన్‌ను ఈ రోజు దాఖలు చేయడం విశేషంగా చెప్పాలి.
ఎనిమిదోసారి గెలుపు కోసం...
ఇక బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా అంతే. హుజూరాబాద్ నుంచి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఈటల రాజేందర్ తన సత్తాను చాటుకున్నారు. ఎనిమిదో సారి గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈటల రాజేందర్ 2004, 2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018, 2021 ఎన్నికల్లో ఆయన వరస గెలుపులతో దూసుకెళుతున్నారు. అన్నీ గెలుపులు ఒక ఎత్తు. 2021 లో జరిగిన ఉప ఎన్నికలు మరొక ఎత్తు. ఆ ఎన్నికల్లో ఈటలను ఓడించడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నామినేటెడ్ పదవులను కేటాయించింది. దళితబంధు పథకాన్ని మంజూరు చేసింది. అయినా సరే ఈటల బీజేపీ నుంచి గెలిచి తన సత్తా చాటారు. అలా ఈరోజు నామినేషన్లు వేసేవారంతా ఉద్దండులే. అందుకే ఈరోజు ముఖ్యనేతలు నామినేషన్లు వేస్తున్నా గెలుపుపై కంటే వారి మెజారిటీ గురించే చర్చ జరుగుతుంది.