Telangana Elections : ఉపసంహరించుకోండి.. ప్లీజ్.. అధికారంలోకి రాగానే పదవి గ్యారంటీ
నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ నామినేషన్ల ఉపసంహరణపై ఫోకస్ ను పెట్టాయి. రెబల్ అభ్యర్థులు ఉన్న చోట వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చివరి సారి ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా పదవులు ఇస్తామని చెబుతున్నారు. ఓట్లను చీల్చి ఓటమికి కారణమయ్యే కంటే సహకరించి పదవులు పొందాలని కోరుతున్నారు.
రెబల్స్ ను బుజ్జగించే...
కాంగ్రెస్ లో పన్నెండు చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. వీరిందరికీ స్వయంగా పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే ఫోన్లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఉపసంహరించుకుంటే జరిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే నామినేెటెడ్ పదవులు ఇస్తామని మాణిక్ రావు థాక్రే రెబల్ గా బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ బుజ్జగిస్తున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకుని నేరుగా వచ్చి తనను కలవాలని ఆయన కోరుతున్నారని చెబుతున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో...
అలాగే అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా చివరి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 114 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కొందరు, తమ భూములను తమకు ఇప్పించాలని వట్టినాగులపల్లి ప్రజలు, ఉద్యోగాలు కల్పించాలని ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని మరికొందరు ఈ నామినేషన్లు దాఖలు చేశారు.
మంత్రులు కూడా...
వీరందరినీ స్వయంగా బీఆర్ఎస్ నేతలు బుజ్జగిస్తున్నారు. వారికి ఫోన్ చేసి తాము అధికారంలోకి వస్తే సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. మాట వినని వారిని మంత్రులు కూడా సంప్రదిస్తూ వారిని నామినేషన్ ఉపసంహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గజ్వేల్ లో నామినేషన్లు వేసిన 114 మందిలో ఇప్పటి వరకూ 28 మంది వరకూ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. మరో 88 మంది గజ్వేల్ లో బరిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఎంత మంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారన్నది చూడాలి.