Telangana Elections : ఓటు కొనడానికి మా ఇంటికి రావద్దు... ఓ ఇంటి ముందు బోర్డు

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు సాగుతుంది

Update: 2023-11-06 04:33 GMT

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు సాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోటీ ఉంది. సర్వేలు కూడా రెండు పార్టీల మధ్య నెక్ టు నెక్ పోటీ ఉన్నట్లు నిర్ధారిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడోసారి గెలుపు లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మూడోసారైనా తమను ప్రజలు ఆశీర్వదించకపోతారా? అన్నా ఆశతో ఉంది.

డబ్బులు ఖర్చుపెట్టేందుకు...
ఈ నేపథ్యంలో పెద్దయెత్తున డబ్బులు ఖర్చు పెట్టేందుకు పార్టీల అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. ఓట్లను కొనుగోలు చేసైనా శాసనసభలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే ఓటు ఎంత విలువైనదో కొందరికే తెలుసు. దానిని తాత్కాలిక ప్రయోజనాలకు అమ్ముకుంటే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందని తెలిసిన వారు అతి కొద్ది మంది. తమ ఓటును తమకు నచ్చిన వారికి, తమ సమస్యలను పరిష్కారం చేస్తారనుకున్న వాళ్లకు మాత్రమే వేయాలని అనుకుంటారు.
ఓటు అమ్మకానికి లేదంటూ....
అందుకు వనపర్తి పట్టణంలో ఒక కుటుంబం ఆదర్శంగా నిలిచింది. " మా ఇంట్లో ఓటు అమ్మకానికి లేదు" అంటూ బోర్డు పెట్టారు. ఓటు కొనడానికి ఎవరూ తమ ఇంటికి రావద్దంటూ వారు బోర్డు పెట్టడం చూస్తే ఇంకా ఈరోజుల్లో ఇటువంటి వారు ఉంటారా? అని చూసిన వారు అనుకుంటున్నారు. వనపర్తి పట్టణంలోని భగీరధ కాలనీలోని ఒక ఇంటి గేటుకు ఈ బోర్డును ఇంటి యజమాని వేలాడదీశారు. దీంతో ఈ బోర్డును అందరూ పెడితే సరైన అభ్యర్థులు ఎంపికై ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. ఆ ఇంటియజమానిని మెచ్చుకుంటున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    

Similar News