Janasena, Bjp : ఇంతకీ ఆ కలయిక తర్వాత జరిగిందిదేనా?
తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారయింది. అయితే ఇప్పటి వరకూ సీట్ల పంపకాలు మాత్రం జరగలేదు
తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారయింది. అయితే ఇప్పటి వరకూ సీట్ల పంపకాలు మాత్రం జరగలేదు. జనసేనాని మాత్రం తన సోదరుడి కుమారుడు వరుణ్ పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరి వెళ్లారు. దీంతో సీట్ల పంపకంపై ఇంకా బీజేపీ, జనసేనల మధ్య సందిగ్దత కొనసాగుతుంది. జనసేన తమకు ఇరవైకి పైగా స్థానాలు కావాలని కోరుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆరుకి మించి ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఈరోజు తెలంగాణ బీజేపీ మలి విడత జాబితాపై కసరత్తు మొదలయింది. జాబితాపై నేడు మూడో విడత జాబితా ఫైనల్ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఏ సీట్లు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కూకట్ పల్లి వంటి...
ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గం తమకు కావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. అక్కడ పోటీ చేసినట్లయితే ఇటు టీడీపీ ఓట్లతో పాటు పవన్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో తమకు గెలుపు అవకాశాలుంటాయని జనసేన నేతలు అంచనా వేసుకుంటున్నారు. కానీ కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇవ్వవద్దంటూ ఏకంగా బీజేపీ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కూడా కొంత సందిగ్దంలో పడింది. అయితే పవన్ కల్యాణ్ ఇటలీ నుంచి వచ్చిన తర్వాతనే ఆ పార్టీకి ఇచ్చే సీట్లపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
53 మంది అభ్యర్థులను మాత్రమే...
బీజేపీ ఇప్పటి వరకూ 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మందిని, మలి జాబితాలో ఒక్క పేరును ప్రకటించింది. ఆ తర్వాత మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుంది. పార్లమెంటు సభ్యులను కూడా శాసనసభ ఎన్నికల బరిలోకి దించింది. ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, బండి సంజయ్ లకు పార్టీ టిక్కెట్లను కేటాయించింది. కిషన్ రెడ్డి పేరు మాత్రం ఫస్ట్ లిస్ట్ లో లేదు. ఆయనను అసెంబ్లీ బరిలోకి దించుతుందా? లేదా? అన్నది కొంత ఆసక్తికరమే. అయితే ఈసారి విడుదల చేసే జాబితాలో యాభై స్థానాల వరకూ అభ్యర్థులను ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జనసేన పోటీ చేస్తుందా?
ఈ పరిస్థితుల్లో మరోసారి పార్టీ నేతలు మిగిలిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో వడపోత కార్యక్రమం ప్రారంభమయింది. నేడో, రేపో మూడో విడత జాబితా కూడా విడుదలవుతుందని చెబుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం మంత్రి అమిత్ షాను కలసి వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరుగుతాయని చెప్పారు. కానీ ఇప్పటికే టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో జనసేన కూడా అదే పనిచేస్తుందా? లేక బీజేపీతో కలసి పోటీ చేయనుందా? అన్నది రెండు మూడు రోజుల్లో తేలనుంది. ఆరు సీట్ల కోసం పోటీ చేయడం ఎందుకని పవన్ ఆలోచించే అవకాశముందని చెబుతున్నారు. జనసేన నేతలు మాత్రం తాము పోటీ చేస్తామని గట్టిగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.