Telangana BJP : బీజేపీలో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు? అసలు కారణం అదేనంటున్నారుగా

బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో అధికారం తమదేనంటున్నారు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్నదే సందేహం

Update: 2023-11-20 11:29 GMT

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ అగ్ర నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకూ ఈసారి అధికారం తమదేనంటున్నారు. ఈ ఈక్వేషన్లు ఎక్కడా కలవడం లేదు. నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లి పోతున్నారు. కొత్త నేతలు వచ్చి చేరడం లేదు. అయినా గెలిచేది మేమేనన్న ధీమాలో కమలదళం ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీజేపీ నిజంగా అధికారంలోకి వస్తుందా? అది ఎలా సాధ్యం? అని జుట్టుపీక్కుంటున్నా జనాలకు మాత్రం అర్థం కావడం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

పోటీ మాత్రం...
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ నెలకొని ఉంది. మరి బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందన్న సందేహాలకు మాత్రం అనేక సమాధానాలు వస్తున్నాయి. అయితే లెక్కలు కమలనాధులు అనుకున్నట్లు వస్తే మాత్రం అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న సమాచారం, సర్వేలు ప్రకారం కొన్నింటిలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, మ
రి
కొన్నింటిలో కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకోగా, మరికొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ తిరిగి తన స్థానాలను నిలబెట్టుకుంటుందన్న సర్వే నివేదికలే బీజేపీ నేతల ఆశలకు కారణంగా చెబుతున్నారు.
హంగ్ వస్తుందనేనా?
వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ఎటూ కాంగ్రెస్ తో కలవరు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమతోనే జట్టు కడతారు. అప్పుడు కేసీఆర్ పార్టీకి కేంద్రంలో మంత్రి పదవులు కేటాయించి తక్కువ స్థానాలను వచ్చినా తాము ఇక్కడ అధికారంలోకి తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే కమలనాధులు హంగ్ ఏర్పడాలని కోరుకుంటున్నారు.
అందుకోసమే ఎంపీలను...
ఈ ఎన్నికల్లో తమకు పదికి పైగా స్థానాలు వస్తే చాలు ముఖ్యమంత్రి పదవి తమకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అందుకోసమే పార్లమెంటు సభ్యులను సయితం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించిందని చెబుతున్నారు. కాంగ్రెస్ కు మద్దతివ్వని కారు పార్టీ తమ వైపే మొగ్గు చూపుతుందని, అది దాని అవసరమే కాకుండా అనివార్యమని కూడా భావిస్తుంది. అందుకే తరచూ పెద్దగా బలం లేకపోయినా ఈసారి అధికారం తమదేనని పదే పదే చెబుతున్నారంటున్నారు. మరి బీజేపీ ఆలోచనలు కేవలం ఆశలుగానే మిగులుతాయా? లేదా? వారనుకున్నట్లు నిజంగానే వర్కవుట్ అవుతుందా? అన్నది డిసెంబరు 3వ తేదీన తేలనుంది.
Tags:    

Similar News