KCR : బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటనలు... నెలన్నర అలుపు సొలుపు లేకుండా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేశారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేశారు. వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు ఆధారంగా ఆయన అలుపు విరామం లేకుండా అన్ని నియోజకవర్గాలను పర్యటించి వచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఆయన 96 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట నియోజకవర్గాలకు వెళ్లి చుట్టి వచ్చారు. హైదరాబాద్ నగరం మినహా దాదాపు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేసీఆర్ ఇన్ని సభల్లో పర్యటించడం చూసి పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా కేసీఆర్ తన పర్యటనలో నాటి ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలు కూడా గుర్తుకు తెచ్చారు. తన ఆమరణ దీక్ష నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పడేంత వరకూ జరిగిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అంతేకాదు తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో కూడా సోదాహరణంగా వివరించారు. ప్రతి సభలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పాటు ప్రసంగించి ప్రజలను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు.
కాంగ్రెస్ వస్తే....
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలను కూడా ఆయన వదలలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటున్న నినాదంపై కూడా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పాత రోజుల్లో పడిన కష్టాలు పడటమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకుండా కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లనే ఎంతోమందిని కోల్పోయామన్నారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పవని, కరెంటు కోతలు పెరుగుతాయని, సంక్షేమ పథకాలు అందవని కూడా ప్రజలను హెచ్చరించారు. పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ కే ఓటేయాలని కోరారు.
బీజేపీ పైనా...
అలాగే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీపై కూడా విమర్శలు చేశారు. బీజేపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో వివరించారు. తమకు మోదీ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం దగ్గర నుంచి మోటార్లకు మీటర్లు పెట్టే ఉత్తర్వుల వరకూ ఆయన చెప్పుకుంటూ ప్రజలను చైతన్య వంతుల్ని చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ తొలుత హుస్నాబాద్ లో అక్టోబరు 15వ తేదీన ప్రారంభించిన ప్రచారం నేడు గజ్వేల్ తో ముగించారు. మరి 30వ తేదీన బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ బొమ్మను చూసి జనం ఓటేసినట్లే అనుకోవాలన్నది విశ్లేషకుల భావన.