KCR : కాంగ్రెస్ ఓట్లు చీల్చడమే లక్ష్యం.. గులాబీ బాస్ వ్యూహమిదే

బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కొంత బలహీనంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఓట్లను చీల్చే యత్నంలో ఉన్నారు

Update: 2023-10-29 06:00 GMT

ీతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కొంత బలహీనంగా ఉన్నారు. ఆ విషయం అర్థమయింది. అందుకే ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధానంగా సర్వే నివేదికలు ఆయనను భయపెడుతున్నాయనుకోవచ్చు. గతంలో రెండుసార్లు ఎదురు కాని పరిస్థితి ఈసారి మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ కొంత దూసుకు వస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్నికలు జరగడం వల్ల ముఖ్యమైన నేతలందరూ అసెంబ్లీ బరిలో నిల్చుని కారు పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రెండు దఫాలుగా జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 55 మందితో, రెండో విడత జాబితాలో 45 మందితో అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.

తాము అనుకున్నదే...
అసంతృప్తులు, అసమ్మతి పైకి కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం లెక్క చేయడం లేదు. తాము అనుకున్న వారికే టిక్కెట్లను కేటాయించిది. జూబ్లీహిల్స్ టిక్కెట్ ను మాజీ మంత్రి పి. జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డికి కాకుండా అజారుద్దీన్ కేటాయించడం, పీజేఆర్ కుమార్తెతో పాటు గద్దర్ కుమార్తె వెన్నెలకు కూడా సీట్లు కేటాయించడం వంటి చర్యలతో కొన్ని వర్గాలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మిత్ర పక్షాల విషయంలోనూ ఏమాత్రం రాజీపడటం లేదు. కమ్యునిస్టులకు కూడా చెరి రెండు సీట్లు మాత్రమే ఇచ్చింది. కోదండరామ్ పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తుందో ఇంత వరకూ తేల్చలేదు. అంటే కాంగ్రెస్ లో గెలుపుపై అంత కాన్ఫడెన్స్ కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతల్లో ఐక్యత కూడా కనిపిస్తుంది.
అసమ్మతి నేతలను...
ఇది సహజంగానే గులాబీ బాస్ ను కొంత ఆలోచనలో పడేసినట్లు కనపడుతుంది. ఇలా అయితే తన హ్యాట్రిక్ విజయానికి గండి పడినట్లేనని ఆయన భావించినట్లున్నారు. అందుకే కాంగ్రెస్ బలహీనతలను ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన ముందున్న లక్ష్యం కాంగ్రెస్ ఓట్లను చీల్చడమే. ఇప్పటికే కాంగ్రెస్ టిక్కెట్ దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు బాహాటంగా కొందరు బయటపడుతున్నారు. మరికొందరు లోలోపల మదన పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి దాదాపు యాభై నుంచి అరవై నియోజకవర్గాలకు పైగా అసంతృప్తులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
సంప్రదింపులు ప్రారంభం...
ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అసంతృప్తులను ఇప్పటికే సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి చేర్చుకోకుండా వారిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపితే హస్తం పార్టీ ఓట్లు చీలే అవకాశాలున్నాయి. తద్వారా బీఆర్ఎస్ విజయం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను బీఆర్ఎస్ సంప్రదించినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వారికి ఎన్నికల ఫండ్ కూడా ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుండటంతో కాంగ్రెస్ కు స్వతంత్ర అభ్యర్థుల పోటీ తలనొప్పిగా మారే అవకాశముందని చెబుతున్నారు. కేసీఆర్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయితే కాంగ్రెస్ ను విజయానికి దూరం చేసే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. మరి కాంగ్రెస్ దీనికి విరుగుడుగా ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News