కేసీఆర్ విమర్శలన్నీ "హస్తం" పార్టీ పైనే... బీజేపీ ఊసే లేదే
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బహిరంగ సభల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ను తన ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బహిరంగ సభల్లో కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ను తన ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ మీదనే ఆయన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటలు కరెంటు వస్తదని, ధరణిని తొలగిస్తారన్న ఆయన ఆ పార్టీకి ఓటు వేస్తే భూుముల ధరలు కూడా పడిపోతాయని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలు చేస్తున్నారు. బీజేపీ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. భువనగిరి సభలో ఆయన ప్రసంగించిన పది నిమిషాలు కాంగ్రెస్ పైనే విమర్శలు చేయడం వినిపించింది.
ప్రగతి కోసం...
ప్రగతి కోసం ఓటు వేయండి తప్ప ఉద్వేగంతో ఓటు వేయవద్దని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పిలుపునిచ్చారు. భువనగిరి ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. మరోసారి ఫైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందని తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని ఆయన అన్నారు. అందరి పోరాట ఫలితంగానే భువనగిరి యాదాద్రి జిల్లా ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ చెబుతుందని, మళ్లీ భూముల విషయంలో రైతులు ఎవరూ ఆగం కావద్దని ఆయన కోరారు. ధరణితో భూములకు శాశ్వతంగా భద్రత లభిస్తుందన్నారు.
కబ్జాదారులు...
మళ్లీ కబ్జాదారులు వచ్చి భూములను గద్దల్లా తన్నుకుపోతారని అన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్లీ కాంగ్రెస్ దెబ్బ పడతదని, వీఆర్వీలు మళ్లీ వచ్చి భూముల విషయంలో ఆగం అవుతారని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ముందుంది అన్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అధికారంలోకి వస్తే మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ వస్తుందని కేసీఆర్ అన్నారు. దళిత బంధు కూడా ఎవరికీ రాదని ఆయన తెలిపారు.
మరోసారి అధికారమిస్తే...
భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గమని, ఇక్కడ కూడా ఐటీ పరిశ్రమలు రావాలని మంత్రి కేటీఆర్ కు చెప్పారని అన్నారు. ఎన్నికల తర్వాత ఐటీ పార్కును పెట్టించే బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు. తనకున్న సర్వే రిపోర్టు ప్రకారం శేఖర్ రెడ్డి యాభై వేల మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని, జాతి లేదని, మతం లేదని, కులం లేదని తెలిపారు. అందరి సంక్షేమం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని, మరోసారి గెలిపిస్తే భువనగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.