మీ మెజార్టీని మీరే తిరగరాయండి : కేసీఆర్

సిద్దిపేట తనకు రాజీకీయంగా జన్మనిచ్చిన గడ్డ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటలో జరిగినసభలో ఆయన ప్రసంగించారు.

Update: 2023-10-17 13:04 GMT

సిద్దిపేట తనకు రాజీకీయంగా జన్మనిచ్చిన గడ్డ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఒకనాడు కరువుతో విలవిలలాడిన సిద్ధిపేట ప్రాంతం నేడు పచ్చటి పొలాలతో కళకళలాడుతుందన్నారు. సిద్ధిపేటలోని ప్రతి గ్రామాన్ని తాను తిరిగానని అన్నారు. కష్టపడి సిద్ధిపేటను ఒకదరికి తెచ్చామని తెలిపారు. సిద్ధిపేట రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనని కేసీఆర్ తెలిపారు. బస్సు గుర్తుమీద పోటీ చేసినా అరవై వేల మెజారిటీ ఇచ్చి నన్ను తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణగా నిలిచానని చెప్పారు. సిద్ధిపేటతో యాభై ఏళ్ల పాటు పెనవేసుకున్న బంధం మనది అని అన్నారు.

అన్ని రకాలుగా...
సిద్ధిపేటకు ఏం జరిగిందో తాను చెబితే బాగుండదని, హరీశ్‌రావును మెచ్చుకున్నట్లుందని అంటారు. తాను తీసుకొచ్చిన ఆరడగుల బుల్లెట్ హరీశ్‌ను మీకు అందిస్తే నా మాటను నిలబెట్టారన్నారు. హరీశ్‌రావు జాగాలో నేను ఉన్నా అంత అభివృద్ధి చేస్తారో తెలియదని అన్నారు. సిద్ధిపేటకు రానిదేంది? లేనిదేంది? అని అడుగుతున్నానని అన్నారు. గోదావరి జలాలతో పాటు రైలు కూడా వచ్చిందన్నారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. మంచినీళ్లు వచ్చాయి, సాగునీరు వచ్చిందన్నారు. మినీ యూనివర్సిటీ వచ్చందని ఆయన తెలిపారు.
దళిత బంధు....
సిద్ధిపేటకు హరీశ్‌రావు పట్టుబట్టి ఐటీ హబ్ ను కూడా తెచ్చారన్నారు. తనకు ఏ మాత్రం సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీ వస్తుందని తెలుసునని అన్నారు. గత ఎన్నికల్లోనే లక్ష మెజారిటీ ఇచ్చారని, ఈ సారి ఆ రికార్డు అధిగమించాలని ఆయన ప్రజలను కోరారు. దళితబంధు పథకం ఆలోచన కూడా సిద్ధిపేట నుంచి వచ్చిందనే అన్నారు. సిద్ధిపేట మంచినీళ్ల పథకమే భగీరధకు స్పూర్తి అని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి దళితబంధు అందే వరకూ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సిద్ధిపేటకు ఇక మిగిలింది ఎయిర్‌పోర్టు రావడమేనని ఆయన అన్నారు.


Tags:    

Similar News