అందరికీ వరాలు.. అన్నీ ఉచితంగానే... ఓటు కోసం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మ్యానిఫేస్టో ప్రకటించనున్నారు. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందచేయనున్నారు

Update: 2023-10-15 03:45 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మ్యానిఫేస్టో ప్రకటించనున్నారు. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందచేయనున్నారు. ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. హుస్నాబాద్ నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తొలుత మ్యానిఫేస్టోను ఆయన ప్రకటించనున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను కేసీఆర్ రూపొందించినట్లు తెలిసింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని, మరోసారి అధికారం ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన ప్రజల ముందుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ధీటుగా ఈ మ్యానిఫేస్టో ఉండే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 12.15 గంటలకు మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.

రైతుల కోసం...
ప్రధానంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతులను ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను రూపొందించినట్లు తెలిసింది. రైతు బంధు సాయం మరింత పెంచుతూ మ్యానిఫేస్టోల ప్రకటిస్తారంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్లకు పదివేలు రైతు బంధును కేసీఆర్ చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని పదహారువేలకు పెంచుతామని మ్యానిఫేస్టోలో ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో పాటు యూరియా బస్తాలను కూడా ప్రతి సీజన్‌లో ఎకరాకు రెండు ఉచితంగా ఇస్తామన్న హామీని కూడా ఇవ్వనున్నారని తెలిసింది. రుణ మాఫీ కూడా రెండు లక్షల వరకూ చేస్తామని హామీ ఇచ్చే అవకాశముంది. ఇక రైతులకు మరిన్ని ప్రయోజనాలను చేకూర్చేలా మ్యానిఫేస్టో రూపొందించారంటున్నారు. రైతులకు పెన్షన్ కూడా ఇచ్చే ప్రతిపాదనను తయారు చేశారు.
మహిళల కోసం...
దీంతో పాటు మహిళలను ఆకట్టుకునేందుకు వంట గ్యాస్ సిలిండర్ ను నాలుగు వందల రూపాయలకే ఇస్తామని హామీ ఇవ్వనున్నారు. అలాగే కేసీఆర్ కిట్ కు ప్రస్తుతం ఇస్తున్న సాయం పదిహేను వేల రూపాయలకు పెంచే అవకాశముంది. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని కూడా ఐదు నుంచి పది లక్షలకు పెంచే ఛాన్సుంది. దీంతో పాటు నగరవాసులను ఆకట్టుకునేందుకు పెట్రోలు, డీజల్ పై పన్ను తగ్గించే అవకాశాలున్నాయి. అయితే ఎంత మేరకు తగ్గిస్తానని చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగులకు కూడా మరిన్ని వరాలు ప్రకటించనున్నారు. గత మ్యానిఫేస్టోలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయలేకపోయామన్నది కూడా వివరించనున్నారు.
పింఛన్లు మరింత...
ఇక రాష్ట్రంలోని కోటి మందికిపైగా పేదలకు బీమా పథకాన్ని వర్తింప చేయనున్నారు. అనుకోకుండా చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల సాయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే నిరుపేద మహిళలకు నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా కేసీఆర్ నేడు ప్రకటించనున్నారు. అలాగే ఒంటరి మహిళలు, వితంతవులు, బీడీ కార్మికులు, వృద్ధులు, హెచ్‌ఐవీ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు కూడా 3,016 రూపాయలకు పెంచే అవకాశముంది. ప్రస్తుతం 2,016 రూపాయలు ఇస్తున్నారు. వీటితో పాటు మరిన్ని కొత్త పథకాలను కేసీఆర్ రూపొందించినట్లు తెలిసింది. కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యేలా మ్యానిఫేస్టో ఉండబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే తాము ఇచ్చే పథకాలను ఉచితాలుగా చూడవద్దని, సంక్షేమంగానే చూడాలని మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Tags:    

Similar News