కుట్రలు జరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండాల్సిందే
బీఆర్ఎస్ అతి ముఖ్యమైన ఘట్టం పూర్తి చేసింది. తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు
బీఆర్ఎస్ అతి ముఖ్యమైన ఘట్టం పూర్తి చేసింది. తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీఫారం నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 9848023175 నెంబరుకు కాల్ చేయాలన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్లనే వేములవాడలో సీటును మార్చామని చెప్పారు. ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడారన్నారు. ఎన్నికల కో-ఆర్డినేటర్ గా భరత్ కుమార్ వ్యవహరిస్తారని చెప్పారు. మళ్లీ విజయం మనదేనని కేసీఆర్ ధీమీ తెలిపారు.
సీట్లను సర్దుబాటు...
సామరస్య పూర్వకంగా సీట్లను సర్దుబాటు చేసుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. కోపతాపాలను అభ్యర్థులను పక్కన పెట్టాలన్నారు. తమకే అంతా తెలుసునన్న ఆత్మవిశ్వాసంతో ఉండొద్దని హితవు పలికారు. ప్రస్తుతం 51 బీఫామ్‌లు మాత్రమే రెడీ అయ్యాయని, మిగిలినవి కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన ప్రకటంచారు. ఎవరూ తొందరపడవద్దని, అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. మనల్ని సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రతి ఒక్క అభ్యర్థి అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలని అన్నారు.
బీ ఫారంలు నింపే సమయంలో...
మనల్ని నేరుగా గెలిచే ధైర్యం లేక కుయక్తులు పన్నుతున్నారన్నారు. టిక్కెట్లు దొరకని అభ్యర్థులు నిరాశ పడవద్దని వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన పదవులను కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లోనే కొంత మంది అభ్యర్థులను మార్చామని, అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదేనని కేసీఆర్ తెలిపారు. మిగిలిన వారికి రెండు రోజుల్లో బీ ఫారాలు అందచేస్తామని తెలిపారు. ప్రత్యర్థుల కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎవరేమనుకున్నా మరోసారి విజయం మనదేనని, అందులో ఏమాత్రం ఢోకా లేదని కేసీఆర్ నేతలకు చెప్పారు.