కవితక్కను ప్రచారానికి రావద్దంటున్నారట... నిజమేనా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రాఫ్ పడిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమెకు ఇబ్బందికరంగా మారింది

Update: 2023-10-20 05:28 GMT

కల్వకుంట్ల కవిత మాటల పుట్ట. కేసీఆర్ కుమార్తెగా ఆమె మాట్లాడే ప్రతి మాట జనంలోకి సూటిగా వెళుతుంది. కల్వకుంట్ల కుటుంబంలో అదొక వరంగా చెప్పుకోవాలి. కవిత, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురూ మాటల మరాఠీలే. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. తెలంగాణ ఉద్యమంలోనూ కల్వకుంట్ల కవిత క్రియాశీలకంగా వ్యవహరించారు. బతుకమ్మ పండగతో ఉద్యమంలో మహిళలను తీసుకొచ్చి రాష్ట్రం రావడానికి ఒక కారణమయ్యారని చెప్పాలి. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె తెలంగాణ ఉద్యమం నిర్వహించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అప్పుడు కుటుంబాన్ని తెలంగాణ సమాజం చూడలేదు. ఎవరొచ్చినా తెలంగాణ కోసమే కదా? అని కౌగిలించుకున్నారు.

గ్రాఫ్ పడిపోయిందా?
అయితే కల్వకుంట్ల కవిత గ్రాఫ్ క్రమంగా పడిపోయిందనే వారు కూడా లేకపోలేదు. వాటికి కారణాలేమైనా గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే అందుకు ఉదాహరణగా చూపుతారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలయినా ఆమెను ఎమ్మెల్సీని చేసి మరో పదవిని ఇచ్చారు తండ్రి కేసీఆర్. అలా ఇప్పుడు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ కల్వకుంట్ల కవితకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరు. అడుగు ముందుకు కూడా వేయలేరు. ఆమె ఓకే చెబితేనే ఏ కార్యక్రమమైనా. నిజామాబాద్ జిల్లా మొత్తం కవిత కనుసైగలతోనే నడుస్తుంది. అది తప్పు కాదు. ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమెకు శాసించే అధికారం ఉండవచ్చు. అందుకు ఎమ్మెల్యేలు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి.
గత రెండు ఎన్నికలకు...
అయితే గత రెండు ఎన్నికలకు ఆమె ప్రచారం అంతా హైలెట్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన కృషి కూడా ఉందని ఖచ్చితంగా చెప్పాల్సిందే. కవిత ప్రసంగాలు అంతగా ఆకట్టుకుని ముఖ్యంగా మహిళలను కారు పార్టీకి దరి చేర్చాయంటారు. కవితక్కగా తెలంగాణలో పేరొందిన ఆమె సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. క్రేజ్ కూడా తెచ్చుకున్నారు. కేసీఆర్ తనయగా అదనపు బలం కూడా. అన్నీ వెరసి కవిత గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అదనపు బలం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కవిత తమ నియోజకవర్గాలకు ప్రచారానికి రావాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు బారులు తీరిన రోజులవి.
సీన్ మారింది...
కానీ ఇప్పుడు సీన్ మారినట్లుంది. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న తర్వాత అప్పటి వరకూ ఉన్న ఇమేజ్‌కు బూజు పట్టిందనే చెప్పాలి. ఆ స్కామ్‌లో నిజానిజాలను పక్కన పెడితే ఒక మహిళగా లిక్కర్ స్కామ్ లో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. కవిత పేరు ఈ స్కామ్‌తో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే కవితక్కకు ఈ ఎన్నికల్లో లీస్ట్ ప్రయారిటీ ఇస్తేనే బెటర్ అని పార్టీ అధినాయకత్వం కూడా భావిస్తుంది. ఆమె ఎక్కువగా నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేసేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆమె లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న తర్వాత మాత్రం కొంత ప్రతిష్ట మసక బారినట్లేనన్నది విశ్లేషకుల అంచనా. మరి కవితను ఈ ఎన్నికల ప్రచారంలో ఎంత మేరకు ఉపయోగించుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News